Cluster Beans Cultivation : గోరు చిక్కుడు సాగులో మేలైన యాజమాన్యం

గోరుచిక్కుడులో అధిక దిగుబడులను పొందాలంటే ఎలాంటి రకాలను ఎంచుకోవాలి.. సమగ్ర యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం...

Cluster Beans Cultivation Guide

Cluster Beans Cultivation Guide : గోరుచిక్కుడు చిక్కుడు జాతి కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్క తీవ్ర కరువు పరిస్థితులను, అధిక వేడిమిని తట్టుకొని మనగలుగుతుంది. మార్కెట్ లో కూడా నిలకడైన ధర ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు ఈ ఖరీఫ్ లో సాగుచేస్తూ ఉంటారు. అయితే సరైన యాజమాన్యం చేపట్టలేకపోవడంతో అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు. గోరుచిక్కుడులో అధిక దిగుబడులను పొందాలంటే ఎలాంటి రకాలను ఎంచుకోవాలి.. సమగ్ర యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం…

వాయిస్ ఓవర్ : గోరుచిక్కుడు ఉష్ణమండలపు పంట. తక్కువ వర్షప్రాతం, అధిక ఉష్ణోగ్రత గల  ప్రాంతాలలో పెంచటానికి అనువైనది. మంచును తట్టుకోలేదు. మురుగు నీరు పోయే సౌకర్యం గల అన్ని నేలల్లో ఈ పంట పండించవచ్చు. ఉదజని సూచిక 7.5 నుండి 8 వరకు ఉన్న నేలలు కూడా అనువైనవి. అధిక సాంద్రత గల బరువైన నేలలు ఈ పంటకు పనికి రావు. ప్రస్తుతం సూటి రకాల తో పాటు హైబ్రీడ్ రకాలు కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పూసామౌసమి, పూసా సదాబహర్, పూసా నవబహార్‌, గౌరి రకాలను ఎంచుకుంటే అధిక దిగుబడిని పొందవచ్చు.ఖరీఫ్‌లో సాగుచేయాలనుకునే రైతులు  జూన్‌ నుండి జూలై వరకు విత్తుకోవచ్చు.  అయితే నేలను తయారు చేసేటప్పుడు బాగా కలియదున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 టన్నులు మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

ఖరీఫ్‌ పంటకయితే 45 సెంటీ మీటర్ల దూరంలో బోదెలు చేసుకోవాలి. ఎకరాకు 12 నుంచి 16 కిలోల విత్తనము సరిపోతుంది. మొదటి సారి గోరుచిక్కుడును వేసే రైతులు పొలంలో , విత్తడానికి ముందు నత్రజనిని అందించే రైజోబియా బ్యాక్టీరియా 200 గ్రా. లను విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. ఎకరానికి 12 కిలోల నత్రజని, 25 కిలోల భాన్వరం, 25 కిలోల పొటాష్‌ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను అఖరు దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన నత్రజనిని గింజలు విత్తిన 30 నుండి 40 రోజులకు వేసి నీటి తడిని  ఇవ్వాలి.

విత్తే ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. 1 కిలో విత్తనాకికి ఇమిడాక్లోప్రిడ్‌ 5 గ్రా. పట్టించి ఆ తర్వాత ఆ విత్తనానికే  టైకోడెర్మా విరిడి 4 గ్రా. లు విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వరుసల మధ్య దూరం 60 సెంటిమీటర్లు , మొక్కల మధ్య దూరం  15 సెం.మీ. ఉండే విధంగా చూసుకోవాలి.  గింజలు విత్తగానే నీరు పారించాలి. 3వ రోజు మళ్లీ నీటి తడిని ఇవ్వాలి. అ తర్వాత నీటి తడులు 7 నుండి 10  రోజుల వ్యవధితో ఇవ్వాల్సి ఉంటుంది.  గింజలు విత్తటానికి ముందే ఎకరాకు బేసలిన్‌ కలుపు మందును 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి తడినేలపై పిచికారి చేస్తే 30 రోజుల వరకు కలుపు లేకుండా చేయవచ్చు. తరువాత 35 రోజులకు ఒకసారి అంతర కృషి చేయాలి.

గోరుచిక్కుడు పంటలకు చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా  పేనుబంక ఆశించినప్పుడు లేత చిగుళ్ళు, ఆకుల నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. దీని నివారణ డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా మెటాసిస్టాక్స్‌ 2 మి.లీ. లేదా ఫాసలోన్‌ 2 మి.లీ. లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి మార్చి పిచికారి చేయాలి. అకులపై తెల్లని పొడి పదార్థం ఏర్పడినట్లైతే  బూడిద తెగులు ఆశించినట్లు గుర్తించాలి. తెగులు ఉధృతి ఎక్కువైతే, ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి.

దీని నివారణకు నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రా. లేదా కెరాథేన్‌ 1 మి.లీ. లేదా అజాక్సిస్ట్రోబిన్‌ 1 మి.లీ. లేదా హెక్సాకొనజోల్‌ 1 మి. లీ. , లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇలా వారం రోజుల వ్యవధితో మరోసారి పిచికారి చేయాలి. అలాగే అకుల మీద నల్లని మచ్చలు వచ్చినట్లయితే ఆకుమచ్చ తెగులుగా గుర్తించాలి. తెగులు ఉధృతి  ఎక్కువైనప్పుడు, మచ్చలన్నీ కలిసిపోయి, అకులు మాడిపోయి, రాలిపోతాయి. దీని నివారణకు మ్యాంకోజెబ్‌ 2.5 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. గోరు చిక్కుడుకు ఆశించే మరో తెగులు ఎండు తెగులు. ఇది ఆశించిన మొక్కలు నిలువునా ఎండి చనిపోతాయి.

దీని నివారణకు టైకోడెర్మావిరిడి 4 గ్రా. ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. 1 కిలో టైకోడెర్మా విరిడి 100 కిలోల వేప పిండికి కలిపి అఖరి దుక్కిలో వేయాలి. అలాగే పొలంలో నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా 3 గ్రాముల కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ మందును లీటరు నీటికి కలిపి మొక్క చుట్టు నేలంతా తడిచేలా పోయాలి. ఇలా ఖరీఫ్ గోరుచిక్కుడులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 20 నుండి 25 క్వింటాళ్ళ దిగుబడిని పొందవచ్చు. అయితే  లేత కాయలను ఎప్పటికప్పుడు కోసి మార్కెట్‌కి పంపాలి. ముదిరినాక  కాయలను కోసినట్లయితే పీచు శాతం ఎక్కువై కాయ నాణ్యత తగ్గి మార్కెట్‌లో ధర పలుకదు.

Read Also : Orchards Subsidies : పండ్లతోటలకు సబ్సిడీలు కావాలంటున్న రైతులు