Vesavi Dukkulu
Vesavi Dukkulu : పంటలకు వేసవి దుక్కులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. చాలా మంది రబీ పంటలు కోయగానే పొలాన్ని అలాగే వదిలేస్తారు. మళ్లీ తొలకరితోనే ఖరీఫ్‌కి సన్నద్ధమవుతారు. చినుకులు పడగానే దుక్కులు దున్నడం మొదలెడతారు. అలాకాకుండా వేసవిలోనే దుక్కులు దున్నడం వల్ల చాలా ప్రయజనాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
READ ALSO : Vegetable Farming : వేసవిలో కూరగాయల సాగు.. అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం
రబీ పంట కాలం పూర్తైంది. ప్రస్తుతం మెట్ట, మాగాణి భూములన్నీ ఖాలీగా ఉన్నాయి. ప్రస్తుత తరుణంలో రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించాలి. ఈ వేసవి 2 నెలలకాలం పొలాలు ఖాళీగా వుంటాయి. కనుక రైతులు తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించినట్లయితే, ఖరీఫ్ లో విత్తే పంటల నుంచి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు.
వేసవిలో భూమిని లోతుగా… అంటే 25-30 సెంటీమీటర్ల లోతున దున్నుకోవాలి. దీనివల్ల గత పంట అవశేషాలను తొలగించటంతోపాటు, చీడపీడలకు సంబంధించిన ప్యూపా దశలను నివారించవచ్చు. అంతేకాదు, వేసవిలో అడపాదడపా కురిసే వర్షపునీటిని పట్టివుంచే శక్తి పెరుగుతుంది అంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్ర్తవేత్త ఫనిశ్రీ.
READ ALSO : Pests In Turmeric : పసుపులో తెగుళ్లు, చీడపీడల నివారణ చర్యలు!
రైతులు సాధారణంగా సంప్రదాయ పద్ధతిలో కొయ్య నాగలితో దుక్కులు చేస్తూవుంటారు. దీనివల్ల దుక్కులు లోతుగా చేయడం సాధ్యపడదు. కేవలం సాళ్లు మాత్రమే ఏర్పడతాయి. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు ఇటీవలి కాలంలో ట్రాక్టర్ కు అమర్చిన గొర్రు లేదా రోటావేటర్‌ను ఉపయోగిస్తున్నారు. వీటితో కూడా ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు.
అందుకే వేసవి దుక్కుల కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు రెక్క నాగలి, ఎంబీ ప్లవ్, డిస్క్ ప్లవ్ వంటి వాటిని సిఫార్సు చేస్తున్నారు. వీటితో దుక్కి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. లోతు దుక్కి వల్ల భూమిలో ఉంటూ పంటలకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. భూమి లోపలి పొరల్లోని సేంద్రీయ పదార్థాలు బాగా చివుకుతాయి. దీనివల్ల భూసారం పెరగటంతోపాటు, నీటినిల్వ సామర్థ్యం కూడాపెరుగుతుంది.
READ ALSO : Chili Pests : మిరపలో తెగుళ్లు, నివారణ పద్ధతులు!