Farmer Earn Huge Profits With Areca nut Cultivation in Telugu
Areca nut Cultivation : తమలపాకులు తాంబూలంగా మారాలంటే వక్క ఉండాల్సిందే. ఆ వక్కతో నోటినే కాదు జీవితాలనూ పండించుకుంటున్నారు వక్క తోట సాగు చేసిన రైతులు. వక్కతోటకు చీడపీడలు, పెట్టుబడులు, కూలీల సమస్యలు తక్కువగా ఉంటుంది. అధికంగా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పండించే ఈ పంట ప్రస్తుతం ఏపీలో విస్తరించింది. మార్కెట్‌లో కూడా మంచి ధర పలుకుతుండటంతో,పంట ను వేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కిల్లీ అంటేనే ఆకు, సున్నంతో పాటు వక్క ఉండాలి. ఇవన్ని కరెక్ట్ గా ఉంటేనే నోరుపండుతుంది. వక్క పడితేనే కిల్లీ రుచిగా మారుతుంది. అంతే కాదు.. పండుగలు, పూజలలో తప్పని సరిగా పంచే పదార్ధాలలో వక్క ఒకటి . అలాంటి వక్కకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఒక్క సారి నాటితే 40, 45 ఏళ్ల పాటు దిగుబడి వస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే నాటిన మొక్కలనుండి మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలం, పొలాసి గూడెం గ్రామానికి చెందిన రైతు కొత్తపల్లి దివాకర్ బాబు.
రైతు దివాకర్ బాబు 2014 లో ఎకరం 8 సెంట్లలో వక్క మొక్కలను నాటారు. అయితే ఈ పంట నుండి 5 ఏళ్ల తరువాతే దిగుబడి ప్రారంభమవుతుండటంతో మొదటి రెండేళ్లు అంతర పంటగా అరటిని సాగుచేశారు. అరటి నుండి వచ్చిన ఆదాయం పెట్టుబడి ఖర్చులు వచ్చాయి. ప్రస్తుతం వక్కనుండి నాలుగవ పంట దిగుబడులను పొందుతున్నారు. అయితే ప్రతి ఏడాది దిగుబడి పెరుగుతూ ఉంటుందని రైతు చెబుతున్నారు.
వక్క పంటకు వర్షాకాలంలో వేరుకుళ్లు తప్ప , ఎంలాంటి చీడపీడలు ఆశించవు. అంతే కాదు.. అతి తక్కువ ఎరువులతోనే పంట దిగుబడులు వస్తాయి. ఇటు పంటకు శ్రమ, కూలీలు పెట్టుబడి కూడా తక్కువే.. మొక్కలు నాటిన 5 ఏళ్లనుండి 45 ఏళ్ల వరకు నిరంతరం దిగుబడులు వస్తూనే ఉంటాయి. మార్కెట్ లో కూడా అధిక ధర పలుకుతుండటంతో… ఏపంటలో లేని లాభాలు ఈ పంట ద్వారా పొందుతున్నట్లు రైతు దివాకర్ చెబుతున్నారు.
Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్లో వరిగట్లపై కూరగాయల సాగు