Rabi Maize : రబీ మొక్కజొన్నలో.. ఎరువులు, కలుపు యాజమాన్యం

Rabi Maize : వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. 

Fertilizer and Weed Control In Rabi Maize

Rabi Maize : రబీ మొక్కజొన్న పంట రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా మారింది. తక్కువ పంట కాలం.. దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మాగాణి భూముల్లో రబీ మొక్కజొన్న వేశారు రైతులు . అయితే ఈ పంటలో ఎరువుల, నీటి తడులు, కలుపు యాజమాన్యం సమయానుకూలంగా చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చు.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు

వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.  స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. ఖరీఫ్ లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు వున్నప్పటికీ, రబీలో నీటిపారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తుంది.రైతులు ఎకరాకు 40 నుంచి 50క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తున్నారు.

మొక్కజొన్న భూమినుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట. రసాయన సేంద్రీయఎరువుల రూపంలో మనం అందించి పోషకాలకు త్వరగా స్పందిస్తుంది. అందువల్ల ఈ పంట సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువులు, సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి. నత్రజనిని 1/3 వంతు దుక్కిలో,  1/3  వంతు పైరు మోకాలు ఎత్తుదశలో,  1/3  వంతు పూత దశలో వేయాలి. భాస్వరం మొత్తం దుక్కిలోనే వేయాలి. పొటాష్  1/2 వంతు దుక్కిలో ,  1/2 వంతు పూత దశలో వేయాలి. జింక్ ను రెండు మూడు పంటలకొకసారి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేసుకోవాలి.

తెలుగు రాష్ట్రాలలో  వరి కోసిన తరువాత నేరుగా కాని , వరి తరువాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కానీ లేదా సాధారణ పద్ధతిలో సాగుచేస్తూ ఉంటారు రైతులు . అయితే మొక్కజొన్నలో చాలా ముఖ్యమైనవి నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం . వీటిని సమయానుకూలంగా చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరం. విత్తేటప్పుడు, విత్తిన 15 రోజులకు , 30 నుండి 35 రోజులకు, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు , గింజ పాలుపోసుకునే దశలో నీటి తడులు తప్పకుండా ఇవ్వాలి. ఉదయం వేళలో ఆకులు చుట్టు చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లు గమనించి నీటితడులను అందించాలి.

మొక్కజొన్నను విత్తిన 40 నుండి 45 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం పంట విత్తిన తరువాత రెండు, మూడు రోజులలోపు అట్రాజిన్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లోఅయితే ఎకరాకు 1200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయాలి. మెక్కజొన్నను  పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం పెండిమిథాలిన్ ను ఎకరాకు 1 లీటరును 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన రెండు రోజులలో పిచికారి చేయాలి. విత్తిన నెల రోజులకు వెడల్పాకు కలుపు నివారణ కోసం 2 ఫోర్ డి సోడియం సాల్ట్ మందును ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

Read Also : Poultry Farming : పెరటి కోళ్ళ పెంపకం ప్రారంభించడం ఎలా..?