Goat And Sheep Farming Methods
Farming Methods : ఒకప్పుడు వ్యవసాయానికి అనుబంధ రంగాలుగా ఉన్న పరిశ్రమలే నేడు రైతుకు ప్రధాన ఆర్ధిక వనరుగా మారాయి. ప్రకృతిలో వస్తున్న మార్పులతో వ్యవసాయం గాలిలో దీపంలా మారింది. దీంతో అనుబంధ పరిశ్రమలే రైతును అన్ని విధాలా ఆదుకుంటున్నాయి. వీటిలో పాడిపరిశ్రమతోపాటు గొర్రెలు పెంపకం ప్రధానంగా చెప్పుకోవచ్చు.
సన్నా, చిన్నకారు రైతులు, కుల వృత్తిదారులే కాకుండా నిరుద్యోగ యువత సైతం వీటి పెంపకం చేపట్టవచ్చు. అయితే జాతుల ఎంపికలో సరైన అవగాహనలేక ముందడుగు వేయలేకపోతున్నారు. ఎలాంటి జాతులను ఎంపిక చేసుకుంటే లాభసాటిగా ఉంటుందో తెలియజేస్తున్నారు దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. లీలాకృష్ణ.
గొర్రెల పెంపకం… ఒకప్పుడు సంప్రదాయ వృత్తిగా ఉండేది . మారుతున్న పరిస్థితుల కారణంగా పచ్చిక బయళ్లు తగ్గిపోయాయి. దీంతో జీవాలను మేపటం కష్టంగా మారింది. మరోవైపు గొర్రెల మాంసానికి దేశంలో నానాటికి డిమాండ్ పెరిగిపోతుంది. మాంసం ధరలు వృద్ధిరేటు వేగంగా వుంది. ఈ నేపధ్యంలో గొర్రెల పెంపకం క్రమేపి వాణిజ్యరూపును సంతరించుకుంది. అయితే వీటి పెంపకంలో లాభాలు ఎంతున్నాయో.. సమస్యలు కూడా అంతే స్థాయిలో వున్నాయి. ముఖ్యంగా గొర్రెల నుండి అధిక లాభాలు పొందేందుకు ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవాలి. దేశంలో దాదాపు 20 జాతుల గొర్రెలున్నా, తెలుగు రాష్ట్రాల్లో అధికంగా నెల్లూరు, దక్కని జాతులను పెంచుతున్నారు. అయితే వాణిజ్య పరంగా ఎలాంటి రకాలను పెంచితే మంచి లాభదాయకంగా ఉంటుందో తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా, దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. లీలాకృష్ణ.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలామంది చిన్న, సన్నకారు రైతులు, నిరుద్యోగులు ఈ రంగంలోకి వచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకుంటున్నారు. సాంద్ర పద్ధతి లేదా పాక్షిక సాంద్ర పద్ధతిలో జీవాలను పెంచే రైతాంగం, షెడ్ల నిర్మాణం, పోషణలో సరైన శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.
గొర్రెల పెంపకం పదికాలాలుపాటు వృద్ధిచెందాలంటే మంచి జాతి ఎంపికతోపాటు, కొనుగోలుచేసే గొర్రెల యొక్క పుట్టు పూర్వోత్తరాల పట్ల రైతులు అవగాహన కలిగి వుండాలి. ఎక్కువ సంఖ్యలో గొర్రెలను పెంచాలనుకునేటప్పుడు అన్నీ ఒకేచోట లభ్యంకావు. కనుక తెలిసినవారి దగ్గరనుంచి, దగ్గరలోవున్న ప్రభుత్వ ఫామ్ లనుంచిగాని, స్ధానిక సంతలనుంచి గాని కొనుగోలుచేయాలి.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..