High Profit From Millet Cultivation
Millet Cultivation : ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పడు పూర్వ వైభవం వస్తోంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్ళీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది.
చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. రబీ పంటగా నవంబరు నుంచి డిసెంబరు మాసాల్లో ఈపంటను సాగుచేయవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్ర్తవేత్త డా. మహేశ్వరమ్మ .
మన దేశంలో వరి, గోధుమ, మొక్కజొన్న తర్వాత చిరుధాన్యాల పంటలు ముఖ్యమైనవి. మిగిలిన పంటలతో పోల్చితే ఈ పంటల్ని తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో తక్కువ రసాయన మందులతో పండించుకోవచ్చు. చీడపీడలు కూడా ఎక్కువగా ఆశించవు. వీటిలో పోషక విలువలు అధికంగా ఉండటం వలన పోషకాహార ధాన్యాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిరుధాన్యాలలో ఒకటైన రాగిని మనపూర్వీకులు ఆహారంగా తీసుకున్నటువంటి సాంప్రదాయ పంట.
వాణిజ్య పంటలు, ఆహారపు అలవాట్లు మారడం వలన పంట విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు , ఆరోగ్యంపై చూపే ప్రభావం వలన మరల చిరుధాన్యాల సాగుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. రాగిలో అధిక కాల్షియం , పోషక విలువలు ఉన్నాయి. ఇలాంటి రాగిని ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీలో ఆరుతడిపంటగా సాగుచేస్తుంటారు. యాసంగి రాగిని డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు.
అయితే, అధిక దిగుబడులు ఇచ్చే రకాలను ఎంపిక చేసుకొని సరియైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చును. అంతే కాదు సకాలంలో ప్రధానమైన పంటను వేసుకోలేని పరిస్థితుల్లో తక్కువ కాలంలో, తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడినిచ్చే రాగిని ప్రత్యామ్నాయ పంటగా వేసుకోవచ్చని సాగు యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్ర్తవేత్త డా. మహేశ్వరమ్మ
రబీలో సాగుచేసే రాగి పంటకు గులాబిరంగు పురుగు, చెదలుపురుగు, అగ్గితెగులు ప్రధాన సమస్యగా మారాయి. పంట ప్రారంభం నుండే ఇవి వ్యాప్తిచెంది తీవ్ర నష్టం కలిగిస్తుంటాయి . వీటి ఉధృతి అధికంగా ఉంటే నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.
Read Also : Rabi Season : వేసవికి అనువైన నువ్వు రకాలు – అధిక దిగుబడికి యాజమాన్యం