Organic Cultivation
Organic Farming : ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా… తరచూ అనారోగ్యానికి గురవుతూనే ఉంటున్నాం. దీనికి పరిష్కారం కనుగొన్న కొంత మంది యువత… సేంద్రీయ వ్యవసాయంతోనే ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలమని గ్రహించి.. ఆ దిశగా అడుగులు ముందుకు వేసి విజయం సాధిస్తున్నారు. ఈకోవలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ సేంద్రీయ వ్యవసాయాన్నే ఉపాధిగా మలుచుకొని.. సత్ఫాలితాలని పొందుతున్నారు. యువతి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చునేమో గానీ, ఎరువులు వేయకుండా పంటలు పండించడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి. పూర్వం పశువులు, కోళ్ల నుంచి లభించిన ఎరువును వ్యవసాయ క్షేత్రాల్లో చల్లడం ద్వారా భూమికి జవసత్వాలను అందించేవారు. కాలక్రమేణా వెలుగుచూసిన నూతన సాగువిధానాలు పాత పద్ధతులన్నిటికీ మంగళం పాడాయి. సహజసిద్ధమైన ఎరువుల స్థానాన్ని రసాయనిక ఎరువులు ఆక్రమించేశాయి.
అయితే, ఈ తరహా ఎరువులను పరిమితికి మించి వాడటం వల్ల పంట ఉత్పత్తులన్నీ విషతుల్యంగా మారడమే కాక, పెట్టుబడి వ్యయమూ పెరిగింది. ఈ నేపథ్యంలోనే సేంద్రియ విధానంలో ప్రకృతిసంబంధ ఎరువులను వాడుతూ మంచి దిగుబడులను సాధిస్తున్న పలువురు రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. ఇదే కోవలో అనంతపురం జిల్లా, అనంతపురం రూరల్ మండలం , అక్కంపల్లి గ్రామానికి చెందిన రైతు దొడ్డి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ, తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
రైతు సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి చదివింది ఎంసిఏ. కొన్నాళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశారు. అయితే ఉద్యోగం సంతృప్తి నివ్వకపోవడం.. మరోవైపు వ్యవసాయంపై ఉన్న మక్కువ సొంతూరికి వచ్చేలా చేసింది. తనకున్న 15 ఎకరాలలో 10 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. పశువుల వ్యర్థాలు, స్థానికంగా లభించే వనరులు, తక్కువ పెట్టుబడితో రసాయన ఎరువుల జోలికి పోకుండా సేంద్రియ విధానంలో ఆరుతడి పంటలైన వేరుశనగ, కంది, జొన్న, సజ్జ, కొర్ర, ఉలువలు లాంటి సంప్రదాయ పంటలను పండిస్తూ.. ఆరోగ్యకరమైన దిగుబడులను తీస్తున్నారు.
చాలామంది రైతులు కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడి డబ్బుతో పాటు భూమిని పాడుచేసుకుంటున్నారు. వ్యవసాయాన్ని దండగ చేస్తున్నారు. ప్రకృతి విధానంలో సాగుచేయడం వల్ల, ఎలాంటి ఖర్చులేకుండా అధిక దిగుబడి సాధించవచ్చని నిరూపిస్తున్నారు రైతు సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి . ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన పెంచుకుంటే , సాగు పండుగలా మారుతుంది. ఇటు ప్రజలకు అటు పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదని నిరూపిస్తున్నారు.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..