Huge Income Gains With Mixed Fruits Cultivation
Fruits Cultivation : విత్తుబట్టి పంట అంటారు. మంచి దిగుబడి రావాలంటే… నాణ్యమైన విత్తనం ఒక్కటే సరిపోదు. ఆ పండించే భూమిలో శక్తి ఉండాలి. జీవ పదార్థం ఉండాలి. వానపాములు, సూక్ష్మజీవుల సంచారం ఉండాలి. నీటిని శోషించుకునే తత్వం ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియ కర్బనం మెండుగా ఉండాలి.
ఈ లక్షణాలన్నీ ఉన్న నేల బంగారంతో సమానం. ఆ భూమిలో ఏ పంటైనా పండుతుంది. ఏ చీడపీడనైనా తట్టుకుంటుంది. అయితే ఇది సెమీ ఆర్గానిక్ పద్ధతిలోనే సాధ్యం. దీన్నే ఆచరిస్తూ.. తన రెండు ఎకరాల్లో పలు రకాలు పండ్ల మొక్కల నుండి సీజనల్ గా దిగుబడిని పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు.
ఇదిగో ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూడండీ.. మొత్తం విస్తీర్ణం 2 ఎకరాలు. ఇందులో మామిడి, నిమ్మ, జీడిమామిడి, సీతాఫలం పండ్ల మొక్కలు ఉన్నాయి. ఈ తోటను సాగుచేస్తున్న రైతు పేరు శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా, రాజనగర్ మండలం, శ్రీరాంపురం గ్రామానికి చెందిన ఈయన మొదటి నుండి పండ్లతోటల పెంపకాన్నే చేపట్టారు. మొదట మామిడి మొక్కలను నాటారు.
వాటి మధ్య ఉన్న ఖాలీస్థలంలో పనస, జీడిమామిడి, సీతాఫలం మొక్కలను పెంచారు. అవి ఇప్పుడు పచ్చని వనంలా తయారైంది. అయితే ప్రతి ఏటా సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పశువుల ఎరువుతో పాటు రసాయన ఎరువులు కూడా అందిస్తున్నారు. దీంతో మొక్కలకు కావాల్సిన పోషకాలు అంది ఏపుగా పెరిగాయి. సీజనల్ వారిగా దిగుబడులను పొందుతున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.