Jowar Cultivation tips and techniques
Jowar Cultivation : ఒకప్పుడు ఖరీఫ్ లో వర్షాధారంగా ఎక్కువగా పండించే జొన్న, పెరిగిన వినియోగంతో, ఇప్పుడు రబీ, వేసవికాలాల్లో నీటి వసతి కింద కూడా సాగుచేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. జొన్నలో ఎకరాకు 10 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులోకి రావటంతో, రైతుల్లో దీని సాగుపట్ల ఆసక్తి పెరింగింది. ఆహారపంటగానే కాక పశువులు,కోళ్ళ దాణాల్లో ముడిసరుకుగా దీని వాడకం విస్తృతమయ్యింది. ఖరీఫ్‌లో సాగుచేసిన స్వల్పకాలిక పంటలు పూర్తయిన ప్రాంతాల్లోను, ఇప్పటికే చాలా మంది జొన్నను విత్తారు. నీటి పారుదల ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. ఈ పంట నుంచి అధిక దిగుబడులు పొందాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం..
జొన్న పంట మంచి పోషక విలువలు కలిగిన తృణధాన్యపు పంట. ఆహార ధాన్యంగానేకాక, పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా వినియోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. కానీ దిగుబడి తక్కువగా వుండటం, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవటంతో రానురాను ఈ పంట విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. అయితే గత కొంత కాలంగా ప్రజల ఆరోగ్య సమస్యల ధృష్ట్యా జొన్న ఉత్పత్తులకు మార్కెట్ లో డిమాండ్ పెరగడం, అటు చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి రావటంతో రైతులు మళ్లీ జొన్నసాగుకు మక్కువ చూపుతున్నారు.
సాధారణంగా రబీజొన్నను అక్టోబరు మాసంలో విత్తుకుంటారు. ఆలస్యంగా విత్తినప్పుడు మొవ్వు ఈగ తీవ్రంగా ఆశించి మొక్కల సాంద్రత తగ్గి, తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రదేశాలలో తేలికనేలల్లో 3 నుండి 5 , బరువు నేలల్లో 2 నుండి 3 నీటి తడులు ఇవ్వగలిగినట్లైతే డిసెంబర్ చివరి వారం వరకు జొన్నను విత్తుకోవచ్చు. అయితే అధిక దిగుబడులను పొందాలంటే తొలిదశనుండే సమగ్ర యాజమాన్యం పద్ధతులను పాంటించాలని రైతులకు సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. ఎస్. మహేశ్వరమ్మ.
రబీజొన్నను ఆలస్యం వేసుకునే ప్రాంతాల్లో మొవ్వు తొలుచు ఈగ , కాండం తొలుచు పురుగు, కంకినల్లి, గింజబూజు తెగులు ఆశించే అవకాశం ఉంది. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. జొన్నలో అధిక దిగుబడుల కోసం ఎన్ని యాజమాన్య పద్ధతులు పాటించినా, పంట కోత కూడా సరైన సమయంలో చేపట్టాలి. జొన్నకు మంచి మార్కెట్ ఉంటుంది. కాబట్టి తక్కువ కాలం, తక్కువ సమయంలో మంచి దిగుబడులను తీసి, లాభాలను గడించవచ్చు.
Read Also : Cabbage Crop : క్యాబేజి పంటలో పొగాకు లద్దెపురుగుల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు