Planting Kanda : కంద నాటడానికి జూన్ నెల అనుకూలం.. అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన మెళకువలు

40,45రోజుల దశలో మళ్ళీ ఒకసారి కూలీలతో అంతరకృషి చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా అరికట్టివచ్చు. నీటి యాజమాన్యంలో భాగంగా వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి వారానికి ఒకసారి తడిని అందిస్తే సరిపోతుంది. ఈవిధంగా ప్రతి దశలోను రైతులు శాస్ర్తీయ పద్ధతులను ఆచరిస్తే నాటిన 7,8నెలలకు పంట కోతకు సిద్ధమవుతుంది.

Planting Kanda : వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలలోను, కృష్ణా, గుంటూరు మరియు ఖమ్మం జిల్లాలో సాగులోవుంది. ఈపంటను సాగుచేయటానికి ఇదే సరైన అదును. కాబట్టి రైతులు విత్తనం ఎంపిక దగ్గర నుంచే ప్రతి దశలోను శాస్ర్తీయతను పాటించినట్లయితే ఎకరాకు 30టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం వుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దుంపలను నాటగా.. ప్రస్తుతం నాట్లు వేసే రైతాంగం ఎలాంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం ..

READ ALSO : Disease Management : కందలో సూక్ష్మదాతు లోపం, చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

రైతుకు లాభదాయకమైన వాణిజ్య పంటల్లో కంద ఒకటి. కందను ముఖ్యంగా  కూరగాయగాను, పచ్చళ్ల తయారీకి వినియోగిస్తారు. దీనిలో ప్రధానంగా పిండిపదార్ధాలు, ఖనిజ లవణాలు, విటమిన్ ఎ, విటమిన్ బి ఎక్కువగా వుంటాయి.కందను నాటడానికి మే, జూన్ నెలలు అనుకూలం వుంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబరు, డిసెంబరు మాసాల్లో కూడా నాటుకోవచ్చు.

మనప్రాంతంలో ప్రధానంగా గజేంద్ర రకం ఎక్కువగా సాగులో వుంది.దీని పంటకాలం 7నుంచి 8నెలలు. కందసాగులో విత్తనపు ఖర్చే ఎక్కువగా వుంటుంది. దాదాపు ఎకరానికి 6నుంచి7టన్నుల విత్తనం అవసరం పడుతుంది. విత్తనాన్ని ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అది వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ఒకవేళ విత్తనంలో నాణ్యత లోపిస్తే పంట దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పైగా రైతుకు ఖర్చు కూడా భారమవుతుంది. అంతేకాకుండా రవాణాలో విత్తనాలు నలిగి, మొలక శాతం దెబ్బ తినవచ్చు. అందువల్ల సొంత విత్తనాన్ని వాడడమే మంచిది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించటానికి  రైతులు పండిన పంటలో కొంత దిగుబడిని విత్తనం కోసం దాచుకుంటారు.

READ ALSO : Kanda Yam Cultivation : కంద సాగుతో మంచి ఆదాయం.. అధిక దిగుబడుల కోసం యాజమాన్య పద్ధతులు !

కంద సాగుకు నీరు నిలువ వుండని, సారవంతమైన నేలలు అనుకూలంగా వుంటాయి. ఎంచుకున్న నేలను ముందుగా 2,3సార్లు బాగా మెత్తగా దున్నుకోవాలి. ఆఖరిదుక్కిలో బాగా చివికిన పశువుల ఎరువును ఎకరాకు 10టన్నులు వేసి, కలియ దున్నాలి. ఇక విత్తనం కొరకు ఎన్నుకున్న దుంపల బరువు సుమారుగా 300 నుంచి 500 గ్రాముల మధ్య వుండాలి. ఒకవేళ పెద్దవిగా వున్నట్లయితే వాటిని ముక్కలుగా కోసి, విత్తనం కొరకు వాడుకోవచ్చు.

ఇలా ముక్కలుగా కోసినపుడు ప్రతి భాగం లోను దుంపకన్ను వుండే విధంగా జాగ్రత్తగా కోసుకోవాలి. నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రపు తెగుళ్ళను నివారించటానికి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. దీనికోసం 10లీటర్ల నీటికి 50గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ మరియు 25మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి, ఆ ద్రావణంలో దుంపలను 15నిమిషాల పాటు వుంచి, తరువాత నాటుకోవాలి. ప్రధాన పొలంలోవరుసల మధ్య 60సెంటీమీటర్లు,  వరుసలో మొక్కల మధ్య  60సెంటీమీటర్లు ఎడం వుండే విధంగా భూమిలో రెండున్నర అంగుళం లోతుగా నాటుకోవాలి.

కంద దుంపజాతి పంట కనుక పోషకాల అవసరం కూడా ఎక్కువగా వుంటుంది. ఆఖరిదుక్కిలో పశువుల ఎరువుతోపాటుగా రసాయనిక ఎరువులయిన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150కిలోలను వేసుకోవాలి. ఎకరాకు నత్రజనిని యూరియా రూపంలో 225కిలోలు…పొటాష్ ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 171కిలోలను 3సమభాగాలుగా చేసి, కంద మొలకెత్తిన 40, 80, 120 రోజుల దశలో దపదఫాలుగా అందించాలి. కొంతమంది రైతులు ఎరువులను చాళ్ళలో వెదజల్లి, నీరు పెడుతూ వుంటారు. దీనివల్ల ఎరువులు వృధా అయి, పంటకు ఎంతమాత్రం ఉపయోగపడవు.

READ ALSO : Redgram Crop : కందిపంటలో చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు !

కనుక మొక్కకు ఇరువైపులా చిన్న గుంతలాగా తీసి, అందులో వేయాల్సిన ఎరువు మోతాదును వేసి, మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన వెంటనే తప్పనిసరిగా ఒక నీటితడని ఇచ్చినట్లయితే వీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.  కందసాగులో రైతులు ఎదుర్కొనే మరొక సమస్య కలుపు. కంద దుంపలు, నాటిన 20,25రోజులకు మొలకెత్తుతాయి. ఈలోపు కలుపు మొక్కలు పెరిగి మనం అందించే నీటికి, ఎరువులకు పోటీ పడుతుంటాయి. కనుక విత్తిన వెంటనే భూమిలో తగినంత తేమ వున్నప్పుడు ఎకరాకు 2లీటర్ల బ్యుటాక్లోర్ లేదా 1లీటరు పెండిమిథాలిన్ 200లీటర్ల నీటికి కలిపి, భూమిపై సమానంగా పిచికారీ చేసుకోవాలి.

40,45రోజుల దశలో మళ్ళీ ఒకసారి కూలీలతో అంతరకృషి చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా అరికట్టివచ్చు. నీటి యాజమాన్యంలో భాగంగా వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి వారానికి ఒకసారి తడిని అందిస్తే సరిపోతుంది. ఈవిధంగా ప్రతి దశలోను రైతులు శాస్ర్తీయ పద్ధతులను ఆచరిస్తే నాటిన 7,8నెలలకు పంట కోతకు సిద్ధమవుతుంది. యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకు 70 నుంచి 110పుట్ల వరకు దిగుబడి సాధించవచ్చు. కందను కొబ్బరి, అరటి వంటి తోటల్లో కూడా అంతర పంటగా సాగుచేసి అదనపు ఆదాయం పొందవచ్చు.

READ ALSO : Redgram : కందిపంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు!

ట్రెండింగ్ వార్తలు