Redgram Crop : కందిపంటలో చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు !

పురుగుల నివారణకు ఎకరానికి ఒక్క లైట్ ట్రాప్ అమర్చుకోవాలి. ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలను అమర్చుకోవాలి. శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగుల ఉదృతిని అంచనా వేయడానికి ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలు అమర్చాలి.

Redgram Crop : కందిపంటలో చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు !

Actions to be taken to prevent pests in Kandi crop!

Redgram Crop : కందిపప్పుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనేక విటమిన్లు, ప్రోటీన్లు ఈ పప్పు దినుసుల్లో ఉన్నాయి. అందుకే కందికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతుల కంది సాగుకు మొగ్గుచూపుతుంటారు. కంది పంటను ప్రధాన పంటగా మరియు పెసర ,మినుము ,వేరు శనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా ఖరీఫ్ లో సాగు చేస్తున్నారు. కంది పంట పూత మరియు కాయ ఏర్పడే దశలో వివిధ రకాల చీడ పురుగులు మరియు తెగుళ్ళు ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కావున పూత మరియు కాయ ఏర్పడే దశలో సరైన సస్య రక్షణ చర్యలు చేపడితే కంది పంటలో అధిక దిగుబడినిసాధించేందుకు అవకాశం ఉంటుంది.

కంది పంట మొగ్గ, పూత,కాయ దశల్లో వర్షం లేదా చిరు జల్లులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. వాటిలో ముఖ్యంగా మారుక మచ్చల పురుగు,శనగ పచ్చ పురుగు, కాయ తొలిచే ఈగ, మరియు కాయ రసంపీల్చే పురుగులు ప్రధానమైనవి. పురుగుల ఉధృతిని అదుపులో ఉంచి అధిక దిగుబడులు సాధించాలంటే సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఉంటుంది.

మారుకా మచ్చల పురుగు : తెల్ల రెక్కల పురుగు లేత ఆకులపై, పూమొగ్గలపై, పిందెలని, కాయలను తొలిచి తింటాయి. కంది పంట పూత దశలో ఆకాశం మేఘా వృత్తమై మరియు అడపాదడపా చిరు జల్లులు కురిసినప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆశించిన తొలిదశలో క్లోరిపైరిపాస్ 2.5 మి.లీ. , ప్రొఫెనోఫాస్ 2.0 మీ.లీ., నోవాల్యూరాన్ 0.75 మి. లీ. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోశాడ్ 0.3 మి. లీ, ఎమామెక్ట్ న్ బెంజోయేట్ 0.4 గ్రా, ఫ్లూబెండమైడ్ 0.2 మి.లీ. పిచికారీ చేయాలి.

 శనగ పచ్చ పురుగు : తల్లి పురుగు లేత చిగుళ్ళ పై, పూ మొగ్గలపై ,లేత పిందెల పై విడి విడిగా గ్రుడ్లను పెడుతుంది. గ్రుడ్ల నుండి వచ్చిన లార్వాలు తొలి దశలో మొగ్గల్ని గోకి తిని తరువాతి దశలో మొగ్గల్ని తొలచి కాయలోనికి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయట ఉంచి లోపల గింజలను తినివేస్తుంది. అందువలన కాయల పై గుండ్రని రంధ్రాలు కనిపిస్తాయి. ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్దతులు పాటించాలి. ఆశించిన తొలిదశలో ఎసిఫేట్ 1.5 గ్రా, మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ, ఇండాక్సాకార్చ్, క్వినాల్ ఫాన్ 2.0 మిలీ, పిచికారీ చేయాలి.

ఆకుమచ్చ పురుగు : కంది పంట పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశించి నష్ట పరుస్తుంది. లద్దె పురుగు ఆకులను ,పూతను చుట్టుగా చుట్టుకొని లోపల ఉండి ఆకులను తింటాయి. ఒక్కోసారి పువ్వులను లేత కాయలను తొలిచి తింటాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మోనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ లేదా క్వినోల్ పాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

యాజమాన్య పద్ధతులు:

పంట వేయక ముందు లోతు దుక్కులు దున్నాలి. పొలాన్ని ఇతర పంట అవశేషాలు లేకుండా శుభ్రంగా ఉంచాలి. గడ్డిజాతి మొక్కలు లేకుండా చేయాలి. అధిక వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తపడాలి. పురుగులను ఆకర్శించే పూల మొక్కలు పొలం చుట్టూ అక్కడ అక్కడ వేసుకోవాలి. పంట మార్పిడి పద్ధతి పాటించాలి. పురుగుల గుడ్లు, తొలి దశ పిల్ల పురుగులు, తర్వాత దశ లద్దె పురుగులు, మరియు కోశస్థ దశ పురుగులను కిరోసిన్ కలిపిన నీటిలో ముంచి నాశనం చేయాలి.

పురుగుల నివారణకు ఎకరానికి ఒక్క లైట్ ట్రాప్ అమర్చుకోవాలి. ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలను అమర్చుకోవాలి. శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగుల ఉదృతిని అంచనా వేయడానికి ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలు అమర్చాలి. మరియు వీటి ఉధృతిని అదుపులో ఉంచుటకు ఎకరానికి 10- 12 బుట్టలను అమర్చాలి. పొలంలో మిత్ర పురుగులు సంఖ్య పెంపొందించుకోవాలి. అవసరాన్ని బట్టి పరాన్నజీవులను పొలంలో వదలాలి.

పురుగు ఉధృతిని బట్టి బ్యాసిల్లస్ తురింజెన్సీస్ ఎకరానికి 300 గ్రాములు పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి హెలికోవెర్పా ఎన్. పి.వి. ఎకరానికి 200 య.ల్. ఇ. వాడాలి. మొగ్గ దశలో పురుగు ఉధృతిని బట్టి వేప నూనె 1500 పి పి ఎం, @ 5 మి. లి, లేదా లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం. అవసరాన్ని బట్టి రసాయనిక మందులను తగిన మోతాదులో పిచికారీ చెయ్యాలి.