సేంద్రియ వ్యవసాయం వైపు రైతన్నల చూపు.. అతి తక్కువ ఖర్చుతో లాభాలు పొందాలంటే?

Matti Manishi : ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి.

Agri Information

రైతాంగానికి సేవలందిచడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ముందంజలో ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలో పనిచేస్తున్న  మెదక్ జిల్లా, ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు విశేష సేవలు అందిస్తుంది.

Read Also : Cow Dung : ఆవు పేడతో బిజినెస్ చేస్తున్న మహిళ.. 10 మందికి ఉపాధినిస్తూ.. అమెరికాకి కూడా..

సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతులకు పరిచయం చేయడం.. శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం.. ప్రకృతి వ్యవసాయంలో పంటల యాజమాన్యం .. చీడపీడల నివారణ.. నూతన వంగడాలను రైతులకు అందించి.. క్షేత్రస్థాయి  పరిశీలన చేసి ఫలితాలను రైతులకు తెలియజేయడం వంటివి ఈ కేవికే అధ్వర్యంలో నడుస్తున్నాయి. అనతి కాలంలోనే రైతుల ఆదరాభిమానాలను చురకొంది .

వ్యవసాయరంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల కునారిల్లుతోంది. వీటికితోడు రుతుపవనాలు దోబూచులాట కారణంగా, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డవిరుస్తున్నాయి. అయితే విపరీతమైన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల, అధిక ఖర్చులే కాకుండా విషతుల్యమైన ఆహరం తయారవుతోంది. గతంలో లాభాల కోసం రసాయనాల వెంటపడ్డారు రైతులు. నేడు లాభాలతో పాటు ఖర్చులు పెరిగాయి. అంతేకాకుండా దిగుబడులు తగ్గాయి.

ఈ నేపద్యంలో ఇటు ఖర్చులు తగ్గించుకునేందుకు, ఆరోగ్యభద్రత కొసం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు.  కానీ ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి.

వాటినన్నీటి అధిగమించి సాగులో అతి తక్కువ ఖర్చుతో ఏవిధంగా లాభాలను ఆర్జించవచ్చో రైతులకు అవగాహన కల్పిస్తూ.. శిక్షణ ఇస్తున్నారు మెదక్ జిల్లా, తునికి గ్రామాంలో ఉన్న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం . 2017లో ప్రారంభమైన ఈ కేవికే అనతి కాలంలోనే మంచి ఫలితాలను సాధించి.. విజయపథంలో నడుస్తోంది.

రైతుల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కొరకు రసాయనాలు లేని వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతోనే ఏకలవ్య గ్రామీణ వికాస పౌండేషన్ కేవికే ను ఏర్పాటు చేశారు. అయితే రైతు స్థాయిలో రసాయన రహిత ఎరువుల, చీడపీడల నివారణకు మందులను తయారు చేసుకోవడం కష్టం . అందుకే శాస్త్రవేత్తలు వీటిని తయారుచేసి రైతులకు అతి తక్కువ ధరలో అందిస్తూ… పంటల దిగుబడిలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

Read Also : Paddy Cultivation : అతి పురాతన దేశీ వరి రకాల సాగుతో అధిక లాభాలు.. మార్కెట్లో మంచి డిమాండ్..!

నైపుణ్యంతోనే మహిళలు సాధికారత సాధించగలరని బలంగా నమ్మిన శాస్త్రవేత్తలు వ్యవసాయ ఉప ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్ లో అధిక డిమాండ్ ఉన్న అల్లోవీరా సాగుచేయించి.. దాంతో సబ్బులను తయారు చేయిస్తున్నారు. దీంతో కేవికే పరిధిలోని గ్రామాల మహిళలు ఆర్థిక స్వావలంభన సాధిస్తున్నారు.

సేంద్రియ వ్యవసాయం రోజురోజుకు ప్రాచుర్యం పొందుతున్న నేపధ్యంతో.. రసాయన రహిత వ్యవసాయం చేయిస్తూ.. నాణ్యమైన పంటలు తీసే విధంగా రైతులను  ప్రోత్సహిస్తోంది ఏకలవ్య గ్రామీణ వికాస్ పౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం. ఇందుకోసం కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ.. దేశంలోనే మొదటి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేవికేగా గుర్తింపు తెచ్చుకుంది.