Mango Farmers in Losses
Mango Farmers : మధుర ఫలంగా పేరుగాంచిన మామిడి.. నెల్లూరు జిల్లా రైతులకు చేదు అను భావాలను మిగిల్చుతోంది. ఈ ఏడాది ప్రతి కూల వాతావరణ పరిస్థితులు మామిడి దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. రెండు నెలలు ఆలస్యంగా కాయలు వస్తున్నా.. ఆశించిన స్థాయిలో దిగుబడి మాత్రం రావడం లేదు. దీంతో పెట్టిన పెట్టుబడికూడా రాక.. మామిడి రైతులు తీవ్రనష్టాలు చవిచూస్తూన్నారు.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు
ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఒక్క గూడూరు డివిజన్ లోనే సుమారు 500 ఎకరాల పైబడి మామిడి సాగులో ఉంది. ఈ ప్రాంతంలో రొమాని, బెనిషా, నీలం, బెంగుళూరు, బంగినపల్లి వంటి రకాలు సాగు చేస్తుంటారు రైతులు. ఈ రకాలకు ఆంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది.
ప్రతి ఏడాది ఇక్కడి నుండి వేల టన్నుల కాయలను దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఎగుమతులు జరుగుతాయి. గత నాలుగేళ్లుగా ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఈ ఏడాది ఎగుమతులపై దిగుబడి గణ నీయంగా ప్రభావం చూపింది.
ప్రతికూల వాతావరణ ప్రభావం వల్ల ఈ ఏడాది ప్రారంభంలో అకాల వర్షాలు కురవడంతో మామిడి పూతపై తీవ్ర ప్రభావం పడింది. వచ్చిన పూత కూడా నిలవని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిందె శాతం తగ్గిపోయి కేవలం 30 శాతం పిందె మాత్రమే తోటల్లో నిలిచింది. మార్కెట్లో ధరలు పెరుగుతున్నా.. దిగుబడి లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మామిడి సాగుకు పురుగు మందులు వాడకం, కూలీల వినియోగం గణనీయంగా పెరిగింది.. పూత రాకపోవడంతో పలు దఫాలు పురుగుల మందులు పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయిందని మామిడి రైతులు వాపోతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి పెట్టుబడులు పెట్టామని ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తాము అప్పులపాలయ్యే పరిస్థితులు నెలకున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.