Nature Farming Of Chapata Mirchi
Chapata Mirchi Farming : ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఎంతో కాలంగా పండిస్తున్న మిర్చి రకం చపాట. లావుగా, టమాటను పోలి ఉండే ఈ రకానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో మార్కెట్ లో మంచి ధర పలుకుతోంది. దీంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ప్రయోగాత్మకంగా ఎకరన్నర విస్తీర్ణంలో సాగుచేశారు. ఎలాంటి రసాయన మందులను పిచికారి చేయకుండా సాగుచేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా.. మంచి దిగుబడులు వస్తున్నాయి.
Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ
చపాట మిర్చి.. పొట్టిగా.. లావుగా టమాటను పోలి ఉండే ఈ రకం మిరపను ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు చాలా కాలంగా పండిస్తున్నారు. డబుల్ పట్టి, సింగిల్ పట్టి, లంబుకాయ, టమాట మర్చి తదితర పేర్లతో దీనిని పిలుస్తుంటారు. ఈ రకం మిరపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా విత్తనోత్పత్తిని రైతులు స్వయంగా చేసుకోవడంతో పాటు పంట సాగులో కూలీల ఖర్చు కూడా ఎంతో తక్కువ. అందుకే చపాట మిర్చిసాగులో రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా బాగా కలిసోస్తుంది.
అందుకే చాలా మంది రైతులు ఈ రకం పంట సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఈ కోవలోనే నిజామాబాద్ జిల్లా, జక్రంపేట మండలం, పడకల్ గ్రామానికి చెందిన రైతు రంగు దేవగౌడ్ సాధారణ మిర్చి రకంతో పాటు ఎకరన్నరలో చపాట మిర్చిని సాగుచేశారు. అయితే సాగులో పెరుగుతున్న రసాయనాల వినియోగం.. అటు నేలకు, ఇటు జీవులకు నష్టాన్ని చేకూర్చుతోంది. అనారోగ్య సమస్యలకూ దారి తీస్తోంది. విచక్షణారహితంగా రసాయనాలు, పురుగు మందుల వినియోగంతో భూసారం క్షీణిస్తోంది. ఈ విధానంలో మార్పు రావాలని భావించిన పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో సాగుచేస్తున్నారు.
వరంగల్ మిరపకాయ అని కూడా పిలువబడే చపాట మిర్చి రంగు ప్రత్యేకంగా ఉంటుంది. మెక్సికన్ క్యాప్సికమన్‌ను పోలి ఉండే ఈ మిర్చి ఎక్కువ ఎరుపు రంగులో ఉండటంతో పాటు కారం తక్కువగా ఉంటుంది. ఈ మిర్చిని ఆహారశుద్ధి పరిశ్రమ, రెస్టారెంట్లు, బేవరేజెస్, పచ్చళ్ల తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ రూ.50 వేల వరకు పలుకుతుంది. అయితే రైతు ప్రకృతి విధానంలో సాగుచేయడం వల్ల పెట్టుబడి చాలా వరకు తగ్గడంతో మంచి లాభాలు వస్తాయని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Watermelon Cultivation : పుచ్చసాగుతో లాభాల బాటలో నిర్మల్ జిల్లా రైతు