Organic paddy cultivation methods
Organic Paddy Cultivation : అత్యంత వెనుకబడిన విజయనగరం వంటి జిల్లాల్లో వరి పంటలో అధిక దిగబడులు సాధించడమంటే అత్యాశే అవుతుంది. ఎందుకంటే, ఈ ప్రాంతాల్లో నీటి వనరులు చాలా తక్కువ. ఎక్కువ వర్షాధార పంటలే. చెరువుల్లో చేరే వర్షపు నీటితోనే పంటలు పండించుకోవాలి.
ఇక రసాయనిక ఎరువులతో కాకుండా, సంప్రదాయ ఎరువులతో వరిని పండించడం కూడా సాహసమే అనుకోవాలి. కానీ, కృషి, పట్టుదలతో పాటు మేలైన యాజమాన్యం పాటిస్తే…. ఈ పద్దతుల్లో కూడా మంచి దిగుబడులు సాధించవచ్చని నిరూపిస్తున్నారు విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు.
విజయనగరం జిల్లా, మెరకముడిదాం మండలం, సోమలింగాపురం గ్రామానికి చెందిన రైతు శిరుఊరి కృష్ణమూర్తి రాజు.. ప్రకృతి విధానంలో వరిని పండించి.. అధిక దిగుబడులు సాధించారు. సాధారణంగా ఈ ప్రాంతమంతా మెట్టభూములే.. వర్షాధార పంటలూ అధికంగా పండుతాయి. వరి సాగుచేసే రైతులు మాత్రం రసాయనిక ఎరువులు పురుగుమందులనే వాడుతుంటారు. కానీ ఈ రైతు మాత్రం కేవలం ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో వరిని పండించి, అధిగ దిగబుడులు సాధించి తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు.
అధిక దిగుబడి, అత్యున్నత జీవనోపాధి, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుందని ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు అంటున్నారు. ఇందుకోసం పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం వైపు జిల్లా రైతులు దృష్టి సారించేలా ప్రణాళికలు రూపొందిచారు.
ఇందులో భాగంగానే రైతు కృష్ణమూర్తిరాజు చేత ఈ ఏడాది ఎలాంటి రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయం చేయించారు. ప్రస్తుతం పంట కోత కోస్తున్నారు. అయితే సాధారణ సాగులో వచ్చే దిగుబడే.. ప్రకృతి విధానంలో రావడం.. అటు జీరో పెట్టుబడి కావడంతో అధిక లాభాలు వచ్చే ఆస్కారం ఏర్పడింది.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..