Pest Control in Brinjal Crop Cultivation
Brinjal Crop Cultivation : కోసిన కొద్దీ కాపు కాస్తూ… టన్నుల కొద్దీ దిగుబడినిచ్చే పంట వంగ. కూరగాయల్లో దీనిది విశిష్ఠ స్థానం. 6నెలల పంటకాలంతో… వంగసాగు రైతుకు మంచి ఆదాయ వనరుగా మారింది. కానీ ఇటీవలి కాలంలో ఈ పంటలో మొవ్వు, కాయతొలుచు పురుగు, వైరస్ తెగుళ్ల బెడద ఎక్కువవటం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన రాష్ట్రంలో వంగను సుమారు లక్ష ఎనభై వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. సంవత్సరం పొడవునా వంగ సాగుచేయవచ్చు.. ప్రస్థుతం మార్కెట్లో వివిధ హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావటం వల్ల ఎకరాకు 10-20 టన్నుల వరకు దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. వంగతోటకు ప్రధాన బెడద అయిన తలనత్త పురుగును సమర్ధంగా అరికట్టగలిగితే దిగుబడులు మరింత పెంచుకునే వీలుంది. ఈ పురుగు నాటిన 30-40రోజుల నుంచి వంగతోటను ఆశిస్తుంది. మొక్కల తొలిదశలో మొవ్వును, తర్వాతి దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలగజేస్తుంది.
ఈ పురుగు ఆశించిన మొక్కల మొవ్వులు వాడిపోయి, కిందకు వేలాడుతుంటాయి. అందుకే దీన్ని తలనత్త అంటారు. వీటిని తుంచి కాండాన్ని చీల్చి చూసినప్పుడు మధ్యలో ఈ పురుగును గమనించివచ్చు.. దీని వుధృతిని అరికట్టేందుకు మొక్కల తొలిదశలో పురుగు ఆశించి వాడిపోయిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి. వుధృతి ఎక్కువైతే కార్బరిల్ 3గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారిచేయాలి. 5శాతం వేప కషాయం లేదా వేపనూనెను తరచూ పిచికారిచేస్తే మొవ్వుతొలుచు పురుగు యొక్క తల్లి రెక్కల పురుగులు పంటమీద గుడ్లు పెట్టకుండా నిరోధించవచ్చు.. కాపు వున్న సమయంలో కాయకోత తర్వాత మందులు పిచికారిచేయాలి.
ఇటీవలికాలంలో వంగతోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువయ్యింది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తిచెందుతుంది. దీని లక్షణాలను గమనిస్తే మొక్కలు గుబురుగా పెరిగి, చీపురు కట్టలా కన్పిస్తాయి. ఆకులు సన్నగా, చిన్నివిగా మారి పాలిపోయిన ఆకుపచ్చ రంగును కలిగి వుంటాయి. పూత,కాత లేకుండా మొక్కలు గొడ్డుబారిపోతాయి. అందుకే దీన్ని వెర్రి తెగులు అని పిలుస్తారు.
ఇది వైరస్ తెగులు కాబట్టి దీనికి నివారణ లేదు. ఈ తెగులును వ్యాప్తిచేసే పచ్చదోమను తొలిదశలోనే నిరోధించాలి. దీనికి గాను మిథైల్ డెమటాన్ 2మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారిచేయాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనంచేస్తే… మిగతా మొక్కలకు ఈ తెగులు వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు.. తెగులు సోకిన మొక్కలను పీకివేసిన తర్వాత జిబ్బరెలిక్ ఆమ్లం 50 మిల్లీగ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారిచేస్తే వెర్రి తెగులు వుధృతి కొంతవరకు తగ్గుతుంది.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..