Pest Control In Broad Beans Cultivation
Broad Beans Cultivation : తెలుగురాష్ట్రాలలో పండించే కూరగాయల పంటలలో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలున్నా, పందిర్ల అవసరం లేని పాదుచిక్కుడు సాగు విస్థీర్ణం అధికంగా వుంది. ప్రస్తుతం ఈపైరు పూత, పిందె దశల్లో వుంది. ఈ సమయంలో మరుకా మచ్చల పురుగు బెడద వల్ల దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని చిక్కుడులో మొజాయిక్ వైరస్ అంటే పల్లాకు తెగులు లక్షణాలు కన్పిస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం.
పాదు చిక్కుడును మురుగునీటి సౌకర్యం కలిగిన అన్ని నేలల్లోను సాగుచేయవచ్చు. దీనిని రబీలో సెప్టెంబరు నుంచి అక్టోబరు మాసం వరకు విత్తుతారు. 50 నుంచి 60 రోజులకు చిక్కుడు పైరులో దిగుబడి ప్రారంభమవుతుంది. పందిర్లపై సాగుచేస్తారు కనుక ఫిబ్రవరి, మార్చి వరకు పంట కొనసాగుతుంది. ప్రస్థుతం మార్కెట్ లో కిలో చిక్కుడు ధర 30 నుంచి 40 రూపాయిలు పలుకుతోంది. ధరల హెచ్చు తగ్గులున్నా సగటున కిలో 15 నుంచి 20 రూపాయల రేటు, రైతుకు లభిస్తే ఫలితాలు ఆశాజకంగా వుంటాయి.
అన్నిసాగు ఖర్చులు పోను రైతు ఎకరాకు లక్ష రూపాయల వరకు నికరఆదాయం పొందే అవకాశం వుంది. ఏటా గుంటూరు పరిసర ప్రాంతాల్లో చిక్కుడును పందిర్లపై విస్తారంగా సాగు చేస్తారు. ప్రస్తుతం ఈపైరు పూత, పిందె దశల్లో వుంది. ఈ సమయంలో దిగుబడిని తీవ్రంగా దెబ్బతీసే మరుకా మచ్చల పురుగు తాకిడి అధికంగా కన్పిస్తోంది. ఇది ఒక్క చిక్కుడులోనే కాదు అన్నిరకాల పప్పుజాతి పంటలకు, పెద్ద సమస్యగా మారింది. దీని తల్లి రెక్కల పురుగు, ఆకుల వెనక భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు పొదిగిన తర్వాత, బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకులను, పూతను, కాయలను మొత్తంగా.. ఒకచోటికి చేర్చి, గూడుగా తయారుచేసుకుని, లోపల వుంటూ పూతను, పిందెను తినివేస్తూ వుంటుంది.
కాయ పెద్దదైన తర్వాత కూడా కాయలకు రంధ్రాలుచేసి లోపలి గింజలను తింటూ నష్టం చేస్తుంది. ఈ పురుగు దాదాపుగా అన్ని ప్రాంతాల్లోను ఆశిస్తుంది. దీనివల్ల నష్టం అపారంగా వుంటుంది.కాబట్టి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగు గూడు కట్టుకుని లోపలి వుంటుంది కనుక రసాయనాలు నేరుగా ఈ పురుగుపై పనిచేయవు. అందువల్ల ఊదర స్వభావం కలిగిన డైక్లోరోవాస్ 1 మిల్లీ లీటరు మరియు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్ల మందును, లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా వున్నట్లయితే, వారం,10రోజుల వ్యవధిలో మరొకసారి స్ర్పే చేయటం వల్ల ఈపురుగును సమర్ధవంతంగా నివారించవచ్చు. చిక్కుడు పైరు పూత దశలో వున్నప్పుడు, ముందు జాగ్రత్తగా ఒకసారి మందు పిచికారిచేస్తే మరుకా మచ్చల పురుగును సమర్ధవంతంగా అరికట్టవచ్చు.
ఈ మధ్యకాలంలో చిక్కుడును నష్టపరుస్తున్న మరొక ప్రధాన సమస్య మొజాయిక్ వైరస్ తెగులు. దీనినే వెర్రితెగులని, పల్లాకు తెగులు అని కూడా పిలుస్తారు. ఈతెగులు ఆశించిన మొక్కల ఆకుల్లో మొదట ఈనెలు పసుపు రంగుకు మారి క్రమేపి ఆకంతా పసుపు రంగుకు మారిపోతుంది. ఆకుల్లో పత్రహరితం లేకపోవటం వల్ల కిరణజన్య సంయోగక్రియ జరగక, క్రమేపి మొక్కలు గిడసబారి క్షీణిస్తాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి. కాయలు తెల్లగా మారటం వల్ల మార్కెట్ విలువ వుండదు..
ఇది వైరస్ తెగులు కావటం వల్ల, దీనికి నివారణ లేదు. పంట విత్తేముందే తెగులును తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక ఈతెగులును, ఒకమొక్క నుంచి మరొక మొక్కకు వ్యాప్తి చేస్తాయి. కనుక వీటి నివారణకు చర్యలు చేపట్టాలి. ముందుగా ఈతెగులు సోకిన మొక్కలను ఏరి, నాశనం చేయాలి. తెగులును తట్టుకునే రకాలను ఎన్నుకుని సాగు చేపట్టినట్లయితే , దీని వ్యాప్తిని కొంత వరకు అరికట్టవచ్చు. రసం పీల్చు పురుగుల నివారణకు విత్తనశుద్ధిని తప్పనిసరిగా పాటించాలి.
ఇందుకోసం కిలో విత్తనానికి 5 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ను కలిపి శుద్ధి చేయాలి. విత్తిన వెంటనే ఎకరాకు, 6 కిలోల కార్భోఫ్యూరాన్ గుళికలను, పాదులలో వేసుకున్నట్లయితే ,రసంపీల్చు పురుగులను నివారించవచ్చు.ఆముదం లేదా గ్రీసు పూసిన 4,5 పసుపురంగు డబ్బాలను ఎకరా పొలంలో అక్కడక్కడా పెట్టినట్లయితే, తెల్లదోమలు పసుపురంగుకు ఆకర్షింపబడి, వాటికి అంటుకుని చనిపోతాయి. చివరి అస్త్రంగా 2 మిల్లీ లీటర్ల డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫిప్రోనిల్ ను లీటరు నీటికి కలిపి, పిచికారీ చేసినట్లయితే, రసం పీల్చు పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు.
Read Also : Leaf Crops Farming : తీగజాతి కూరగాయల సాగుతో.. లాభాలు పొందుతున్న రైతు