Leaf Crops Farming : తీగజాతి కూరగాయల సాగుతో.. లాభాలు పొందుతున్న రైతు
Leaf Crops Farming : పందిరి సాగు ఎన్నో లాభాలను తెచ్చిపెడుతున్నది. ఒక్కసారి పందిరి వేసి తీగ జాతి కూరగాయలను సాగుచేస్తే.. ఇక వెను దిరిగి చూడాల్సిన అవసరం ఉండదు.

Huge Profits Earns With Leaf Crops Farming
Leaf Crops Farming : విభిన్న సాగు.. వైవిధ్య పంటలు.. మార్కెట్ గిరాకీ లాంటి అంశాలను గమనిస్తూ.. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ.. తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలు గడిస్తున్నారు కొందరు రైతులు.
వ్యవసాయమంటే దండగ కాదని.. మెలకువలతో ముందుకు సాగితే పండగేనని నిరూపిస్తున్నారు. ఈ కోవకే వస్తారు ఏలూరు జిల్లాకు చెందిన రైతు రాంబాబు. మరి ఆయన చేసిన పంటలు ఏంటీ.. ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారో మనమూ తెలుసుకుందామా ..
పందిరి సాగు ఎన్నో లాభాలను తెచ్చిపెడుతున్నది. ఒక్కసారి పందిరి వేసి తీగ జాతి కూరగాయలను సాగుచేస్తే.. ఇక వెను దిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడిని సాధించవచ్చు.
ఆధునిక పద్ధతులను పాటిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పందిరిపై కూరగాయలను సాగుచేస్తే అధిక లాభాలు వాటంతట అవే వస్తాయని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలం, మంగపతి దేవి పాలెం గ్రామానికి చెందిన రైతు పెరుబోయిన రాంబాబు.
పరిమిత విస్తీర్ణంలో అధిక రాబడికి పందిరి విధానాన్ని ఎంచుకున్నారు రైతు రాంబాబు. మూడెకరాల్లో సొర, బీర, దోస, చిక్కుడు , బెండ, కాకర, పొట్ల , బీన్స్, చెమ్మకాయ లాంటీ తీగజాతి కూరగాయలను సాగు చేస్తున్నారు. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి పందిళ్లు వేశారు.
డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు అందిస్తున్నారు. సాగులో సాంకేతికత.. మార్కెట్లో గిరాకీకి అనుగుణంగా వ్యవహరిస్తూ.. నిరంతరం దిగుబడులు వచ్చేలా తీగజాతి కూరగాయలను సాగుచేస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్మతూ… పెట్టుబడికి మూడు రెట్ల ఆదాయం పొందుతున్నారు.