Pest control in crops at the lowest cost
Pest Control Crops : పంటల్లో చీడపీడల నివారణకు పురుగుమందుల పిచికారీ ఒక్కటే పరిష్కారం కాదు. పురుగు కనబడిందే తడవుగా మందులు పిచికారీచేస్తే, పర్యావరణ కాలుష్యం పెరగటంతోపాటు, రైతుకు సాగు ఖర్చు భారమై, వ్యవసాయం గిట్టుబాటుగా వుండదు. పంటలకు ప్రధాన శత్రువులు… రసం పీల్చు పురుగులు.
అలాగే కాండం తొలుచు పురుగులు, కాయతొలుచు పురుగుల బెడద వల్ల రైతులు తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కుంటున్నారు. వీటిని సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో సులభంగా అధిగమించవచ్చు. దీనిలో ఎన్నో రకాల పద్ధతులను శాస్త్రవేత్తలు రూపొందించారు. వాటిలో కొన్ని మీకోసం.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు
పంటల సాగులో రైతుకు ప్రధాన సమస్య చీడపీడలు. వీటిని అదుపులో వుంచేందుకు శక్తివంతమైన మందులను పదేపదే పిచికారీచేయటం వల్ల, పురుగులు వీటికి నిరోధక శక్తిని పెంచుకుని, మరింతగా దాడిచేస్తున్నాయి. రసాయన మందుల వల్ల, పంటకు మేలు చేసే మిత్రపురుగులు నశించిపోతున్నాయి.దీనివల్ల రైతు అదుపు చేయలేని స్థాయిలో పురుగులు దాడిచేస్తున్నాయి.
అందువల్ల సమగ్ర సస్యరక్షణ విధానాల పట్ల రైతులు అవగాహన పెంచుకోవాలి. జీవించు జీవించనివ్వు అనేదే… సమగ్ర సస్యరక్షణ యొక్క ముఖ్యోద్దేశం. పంటలో మిత్రపురుగుల శాతం అధికంగా వున్నప్పుడు, హానికారక పురుగుల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా రసాయనాలు అవసరం లేని అనేక విధానాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటిలో జిగురుపూసిన అట్టలు, లింగాకర్షక బుట్టలు, ఎర పంటలు ఇలా అనేకం వున్నాయి. వీటి ద్వారా పురుగు ఉధృతిని తెలుసుకుని అవసరాన్నిబట్టి చర్యలు చేపట్టవచ్చు. తద్వారా రైతుకు సాగు ఖర్చు తగ్గుతుంది.
పంటల్లో పసుపురంగు అట్టలు పెట్టడం వలన రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంక , దీపపు పురుగులను సమర్ధంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా కూరగాయలు, వాణిజ్య పంటైన మిరప, వివిధ రకాల పండ్ల తోటల్లో ఇది మంచి ఫలితాలు అందిస్తోంది. ఎకరాకు 10 నుండి 20 వరకు ఈ జిగురు పూసిన పసుపు రంగు అట్టలను పెట్టుకోవచ్చు.
నీలి రంగుకు తామర పురుగులు ఆకర్షింపబడతాయి. అందువల్ల వీటిని పంటలో ఉపయోగించటం వల్ల ఈ రసం పీల్చు పురుగు తాకిడిని తగ్గించవచ్చు. ముఖ్యంగా మిరప , ఉల్లి, అపరాలు, పండ్లతోటల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఈ అట్టలు ప్రకాశవంతమైన పసుపు, నీలం రంగులో ఉండి వీటికి రెండు వైపులా పురుగులు ఆకర్షించే జిగురు వ్రాసి ఉండడం వల్ల పురుగులు వీటికి ఆకర్షించబడి వాలినప్పుడు అతుక్కొని తిరిగి ఎగరలేక చనిపోతాయి. తద్వారా వైరస్ తెగుళ్ళు వ్యాప్తిని నిరోధించవచ్చు. ఈ జిగురు ఎరల వల్ల ముఖ్యంగా పంటల్లో ఎలాంటి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందో గమనించి వాటిని అరికట్టడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో తెలుసుకోవచ్చు. ఈ పసుపు మరియు నీలిరంగు అట్టలను నారును పెంచే క్షేత్రాల్లో, పాలీహౌస్ లలో, షేడ్ నెట్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు.
వీటిని కూరగాయపంటల్లో ఒక అడుగు ఎత్తులో కట్టి వేలాడదీయాలి. పంట ఎదుగుదలను బట్టి జిగురు ఎరలను మార్చుకోవాలి. అలాగే తోట పంటల్లో కొమ్మలకు లేదా చెట్ల మధ్యన వెలుతురు ఉన్న ప్రదేశంలో కర్రకు కట్టి వేలాడదీయడం ద్వారా వైరస్ తెగుళ్ళు వ్యాప్తికి కారణమైన రసంపీల్చు పురుగులను తగ్గించవచ్చు. ఈ జిగురు అట్టలు ఎకరానికి 10-12 అట్టలు సరిపోతాయి. వీటి యొక్క ధర ఒక్కొక్కటి రూ. 15/- ఉంటుంది. ఖర్చు ఎక్కువ అవుతుందనుకుంటే నిర్ధేశించిన రంగు అట్టలకు ఆముదం పూసి వాడుకోవచ్చు.
వరి, పత్తి , మొక్కజొన్న, కూరగాయ పంటలకు హానికరమైన కాయతొలుచు పురుగులు, కాండంతొలిచే పురుగుల నుండి పంటను కాపాడేందుకు, క్రిమిసంహారక మందుల పరిష్కారం ఒక్కటే కాదు. వీటి ఉనికిని లింగాకర్షక బుట్టలు ద్వారా తెలుసుకోవచ్చు. ఎకరాకు 4 నుంచి 8 వరకు పెడితే వీటి ఉధృతిని అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టలోని ల్యూర్ కు మగ పురుగులు ఆకర్షింపబడి బుట్టల పడిపోతాయి. దీనివల్ల వీటి సంతానోత్పత్తి తగ్గిపోతుంది.
ఈ లింగాకర్షక బుట్టలను అన్ని పంటలకు వినియోగించుకున్నట్టయితే క్రమేపి పురుగుల ఉధృతి తగ్గించుకోవచ్చు. వీటి ద్వారా రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గి, రైతుకు ఖర్చు కలిసి వస్తుంది. ఆర్థిక ఫలితాలు పెరుగుతాయి. అందువల్ల సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై ప్రతీ రైతు అవగాహన పెంచుకోవాలి. రసంపీల్చు పురుగులు ఎక్కువగా వున్న మెట్టపంటల్లో, చేను చుట్టూ రెండు మూడు వరుసలుగా జొన్న లేదా మొక్కజొన్న విత్తకుంటే ఇవి రసంపీల్చు పురుగులు పంటపై వాలకుండా నిరోధకాలుగా పనిచేస్తాయి. మిత్ర పురుగుల వృద్ధికి తోడ్పడతాయి.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..