Pest Control in Turmeric Crop
Turmeric Crop : విదేశీ మారకద్రవ్యాన్ని అధికంగా ఆర్జించిపెట్టే వాణిజ్యపంట పసుపు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో పసుపు సాగుచేయబడుతోంది. పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి సాగు చేపట్టిన నాటినుంచే పాటించాల్సిన యాజమాన్యచర్యలను జాగ్రాత్తగా ఆచరించాలి. ప్రస్థుతం పసుపు పంట 75 నుంచి 135 రోజుల దశలో వుంది. చాలా ప్రాంతాల్లో వేరుకుళ్ళు, ఆకుమచ్చ , దుంపకుళ్లు తెగుళ్ళతో పాటు దుంపఈగ ఆశించాయి. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి.
సాధారణంగా పసుపు సాగులో, ఎంచుకున్న రకాలను బట్టి విత్తే సమయం ఆధారపడి వుంటుంది. స్వల్పకాలిక రకాలైతే మే చివరి వారంలోను, మధ్యకాలిక రకాలను జూన్ మొదటి పక్షంలోను, దీర్ఘకాలిక రకాలు అయితే జూన్ రెండవపక్షం నుంచి జూలై మొదటిపక్షం వరకు విత్తుతారు. తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎక్కువగా దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో పసుపు పంట 75 రోజుల నుంచి 135 రోజుల దశలోవుంది.
పసుపు దిగుబడిని, నాణ్యతను దెబ్బతీసే చీడపీడల్లో దుంప తొలుచు ఈగ, దుంపకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు, ఆకుమచ్చతెగులు ప్రధానమైనవి. వీటిలో దుంప తొలుచు ఈగ పంటకు తీవ్రనష్టం చేస్తుంది. దీనినే “రైజోమ్ ఫ్లై ” అంటారు. పంట చివరి వరకు దీని నష్టం వుంటుంది. దీని పిల్లపురుగులు తెల్లగా బియ్యపు గింజ సైజులో వుండి, దుంపలోపల వుంటూ, నష్టపరుస్తాయి. మొదటగా ఆకులు గోధుమ రంగుకు మారి, చివరకు ఎండిపోతాయి. మొవ్వును పీకినట్లయితే సులభంగా ఊడి వస్తుంది. దీని నివారణకు మొదటగా దుంపలను తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసి నాటుకోవాలి. ఎరువులను సిఫారసు మేరకు మాత్రమే పంటకు వేయాలి. నీరు పొలంలో నిలబడకుండా మురుగునీరుపోయే సౌకర్యం ఏర్పాటుచేసుకోవాలి. దుంపపుచ్చు లక్షణాలు కనబడగానే ఎకరాకు 100 కిలోల వేపపిండి లేదా , 10కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను పొలమంతా సమానంగా చల్లుకోవాలి.
పసుపు పంటకు సోకే చీడపీడల్లో దుంప వేరుకుళ్లు తెగులు అత్యంత ప్రమాదకరమైనది. ఇది పంట దిగుబడిని దారుణంగా దెబ్బతీసి, రైతును ఆర్థికంగా కుంగదీస్తుంది. ఈ తెగులు అన్ని రకాల నేలల్లోనూ కన్పిస్తుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కల చుట్టూ నీరు చేరితే, తెగులు వేగంగా వ్యాప్తి చెందుతుంది. మురుగు నీటి పారుదల సౌకర్యం సరిగా లేకపోవడం కూడా తెగులు వ్యాప్తికి కారణమే. ఈ తెగులు ముందుగా తోటలో అక్కడక్కడా కన్పిస్తుంది. ముదురు ఆకులు ఎండిపోతాయి. మొక్కలు కుచించుకుపోతాయి. వేర్లు, దుంప కుళ్లిపోతాయి. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు తల్లి దుంపల నుంచి పిల్ల దుంపలకు వ్యాపిస్తుంది. క్రమేపీ కాండం మెత్తబడి, మొక్క చనిపోతుంది. మొవ్వును పీకి చూసినపుడు చెడువాసన వస్తుంది.
ఈ తెగులు నివారణకు సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి. విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. చేలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. గతంలో వేసిన పంట ఈ తెగులు బారిన పడి ఉంటే అదే చేలో మళ్లీ పసుపు వేయకూడదు. పంట మార్పిడి చేయాలి. దుంపకుళ్లు నివారణకు… 1కిలో ట్రైకోడెర్మా విరిడెను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో కలిపి 15 రోజుల పాటు అనువైన పరిస్థితుల్లో అభివృద్ధి చేసి, ఆ మిశ్రమాన్ని ఆఖరి దుక్కిలో కానీ లేదా నెల రోజులకు మొదటి తవ్వకం చేసిన తర్వాత కానీ నీటి తడి ఇచ్చి వెంటనే చల్లాలి. లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి, ఆ మందు ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదళ్లు తడిచేలా పాదులో పోయాలి.
పసుపుకు నష్టం చేసే తెగుళ్ళలో మరొకటి ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు పంట చివరిదశలో అంటే నవంబర్, డిసెంబర్ నెలలో ఎక్కువగా కనబడుతుంది. గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్ర ఉండటం, పంటలో సూక్ష్మ వాతావరణం ఎక్కువ తేమగా ఉండటం, పంట అవశేషాలు పొలంలో, పొలం చుట్టూ ఉండటం వలన ఈ తెగులు ఆశిస్తుంది. ఆకులపై చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు కనబడితే ఈ తెగులు ఆశించినట్లు గుర్తించాలి. ఇవి క్రమేపి చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారుతాయి. తెగులు తీవ్రమైతే మచ్చలు ఎక్కువై ఆకులు మాడిపోతాయి. దుంపలు, కొమ్ముల ఎదుగుదల తగ్గి దిగుబడి , నాణ్యత తగ్గిపోతుంది. దీని నివారణకు విత్తనశుద్ధి చేసుకోవాలి. తెగులుతో ఉన్న మచ్చలు ఉన్న , ఎండిన ఆకులను తొలగించి కాల్చి వేయాలి.
Read Also : Cotton Storage : పత్తి తీతల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు