Cotton Storage : పత్తి తీతల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Cotton Storage : ప్రత్తిని ఏరే సమయం కూడా దీని నాణ్యతను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా అక్టోబరునుంచి పత్తి తీతలు ప్రారంభమవుతాయి. శీతాకాలం కావటం వల్ల, ఉదయం వేళల్లో మంచు ఎక్కువగా వుంటుంది.

Precautions in Picked Up Cotton Storage
Cotton Storage : మెట్ట ప్రాంతాల్లో పత్తీ తీత పనులు జోరుగా సాగుతున్నాయి. తొలకరి సీజన్ కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో సాగు ఆలస్యమైనప్పటికీ… సకాలంలో విత్తిన ప్రాంతాల్లో ఇప్పటికే పత్తిని తీతలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే తీస్తున్నారు. సాధారణంగా మనం సాగుచేస్తున్న పత్తి రకాలు, దఫ దఫాలుగా పూతకు రావటం వల్ల కనీసం నాలుగైదుసార్లు పత్తిని తీయవలిసి వుంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో పత్తి ఎండ తక్కువ వున్నప్పుడు పత్తి తీతలు జరపాలి. పత్తి తీతలు, నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్లబంగారంగా పిలవబడే ప్రత్తి.. మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా బి.టి.రకాల రాకతో సాగు విస్థీర్ణం మరింతగా పెరిగింది. ఎంతలా అంటే ప్రతి సంవత్సరం 3నుంచి 6శాతం వరకు దీని సాగును విస్తరిస్తూ… అనువుగాని నేలల్లో సైతం దీని సాగును చేపడుతున్నారు మన రైతులు. సాధారణంగా ప్రత్తిని మే చివరి వారం నుంచి జూలై 2వ వారం వరకు విత్తుతారు. కోస్తాజిల్లాల్లోని నల్లరేగడి నేలల్లో మాత్రం జూలై నుంచి ఆగష్టు వరకు పత్తి విత్తటం జరుగుతుంది. సాగు ఆసాంతం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న రైతాంగం… తీతల సమయంలో కూడా కొన్ని మెలకువలు పాటించినట్లయితే, నాణ్యమైన పత్తిని పొందవచ్చు. ప్రత్తిలో రకాలను బట్టి తీతల సమయం ఆధారపడి వుంటుంది. ప్రత్తి నాణ్యత.. ముఖ్యంగా పింజ పొడవు, గట్టితనం, మృధుత్వం మీద ఆధారపడి వుంటుంది. సాధారణంగా మనం సాగుచేస్తున్న ప్రత్తి రకాలు దఫ దఫాలుగా పూతకు రావటం వల్ల కనీసం నాలుగైదుసార్లు, తీతలు చేయవలిసి వుంటుంది.
ప్రత్తిని ఏరే సమయం కూడా దీని నాణ్యతను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా అక్టోబరునుంచి పత్తి తీతలు ప్రారంభమవుతాయి. శీతాకాలం కావటం వల్ల, ఉదయం వేళల్లో మంచు ఎక్కువగా వుంటుంది. కనుక ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4,5 గంటల మధ్య పత్తి తీయాల్సి వుంటుంది. పూర్తిగా పగిలిన కాయల నుంచి మాత్రమే పత్తిని తీయాలి. కొన్ని సందర్భాల్లో మొక్కపై కొన్ని కాయలు పగిలి, మరికొన్ని పగలకుండా వుంటే.. రైతులు 2,3రోజులు ఆలస్యం చేస్తూవుంటారు. అలాంటి సందర్భాల్లో అకాల వర్షాల వల్ల లేదా, అధికంగా పడే మంచు వల్ల, పగిలిన ప్రత్తి కూడా రంగు మారి, నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పగిలిన కాయల నుంచి తీతలు చేయటం మంచిది. అలానే పూర్తిగా పగలని కాయల నుంచి ప్రత్తిని తీస్తే అది పూర్తిగా విప్పుకోక పోవటం వలన ముడిపత్తిలాగా వుండి, నాణ్యమైన ప్రత్తితో కలిపి మార్కెట్ చేసినపుడు, రైతులు ధరను కోల్పోతారు. మొదటి 2,3తీతల్లో వచ్చే ప్రత్తి అధిక నాణ్యంగా వుంటుంది కనుక దీనిని వేరుగా మార్కెట్ చేసుకున్నట్లయితే మంచి ధరను పొందే అవకాశం వుంటుంది.
సాధారణంగా మనరైతులు కాంట్రాక్టు పద్ధతిలో కూలీలతో తీతలు చేయిస్తూ వుంటారు. వీరికి ప్రస్తుతం కిలో పత్తికి 10 రూపాయల వరకు ఇస్తున్నారు. ఎంత ఎక్కువ పత్తి తీస్తే అంత కూలీ కనుక, పని హడావిడిలో చెత్తాచెదారంతో కలిపి తీతలు చేస్తుంటారు. దీనివల్ల నాణ్యతను కోల్పోవలసి వుంటుంది. ప్రత్తి తీయగానే నీడలో మండెలు వేయాలి. దీనివల్ల గింజ బాగా గట్టిపడటమే కాకుండా, అందులోని తేమశాతం తగ్గి, ప్రత్తి శుభ్రంగా వుంటుంది. లేనట్లయితే గింజలు ముడుచుకుపోయి ప్రత్తి తూకం తగ్గటమే కాకుండా అందులో ముక్కుపరుగు చేరి నాణ్యత దెబ్బతింటుంది. నిల్వచేసే సంచులు కాడా ఎలాంటి దుమ్ము, ధూళీ లేకుండా శుభ్రంగా వున్నట్లయితే.. ప్రత్తి రంగు మారకుండా నాణ్యంగా వుంటుంది.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..