Maize Cultivation
Maize Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వరి పత్తి తరువాత అత్యధికంగా సాగుచేసే పంట మొక్కజొన్న. వర్షాధారంపై ఆధారపడి సాగుచేసే ఈ పంటను రైతులు సకాలంలోనే విత్తారు. అయితే కొన్ని రోజులుగా వరుసగా కురిసిన వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ప్రస్థుతం వివిధ దశల్లో దశల్లో వున్న మొక్కజొన్న పైరులో ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యలేంటో ఇప్పుడు చూద్దాం..
READ ALSO : Birds : పక్షుల గుంపులు ‘V’ ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయో తెలుసా?
ఖరీఫ్ మొక్కజొన్నను వర్షాధారంగా రైతులు సాగు చేస్తారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడటంతో సమయానుకూలంగానే మొక్కజొన్న విత్తారు. ప్రస్తుతం పైరు 25 నుంచి 40 రోజుల దశలో వుంది.మొక్కజొన్న భూమినుంచి అధికంగా పోషకాలను సంగ్రహించే పంట. అందువల్ల నిర్ధేశించిన ఎరువులను సకాలంలో అందించాలి.
ప్రస్థుతం 30-35రోజుల దశలో వున్న పైరుకు ఎకరాకు 40-50కిలోల యూరియాను పైపాటుగా అందించాలి ఎరువు వేసిన వెంటనే దంతె లేదా గొర్రుతో అంతర కృషిచేస్తే ఎరువు మట్టితో కప్పివేయబడి వేళ్లకు అందుతుంది. అంతర కృషివల్ల మట్టి మొక్క మొదళ్ళకు ఎగదోయబడి మొక్కలు పడిపోకుండా వుంటాయి. భూమి గుల్లబారటం వల్ల వేళ్లు గాలి పోసుకుని పంట ఏపుగా, ధృడంగా పెరుగుతుంది. పైరు 50 నుంచి 55రోజుల దశలో మరోసారి 40-50కిలోల యూరియాతో పాటు 15 నుంచి 20కిలోల మ్యూరేట్ పొటాష్ ను వేయాలి. ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ వుండేటట్లు జాగ్రత్త వహించాలి.
READ ALSO : Supreme Court: వివాహేతర బంధంలో పుట్టిన పిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
వర్షాలు అనుకూలంగా లేక నీటి ఎద్దడి తీవ్రంగా వున్న ప్రాంతాల్లో ఎరువులను పైపాటుగా అందించటం అంత శ్రేయస్కరం కాదు. ఈ దశలో మొక్కలు వేళ్ల ద్వారా పోషకాలను సంగ్రహించలేని స్థితిలో వుంటాయి. అందువల్ల మొక్కలు కోలుకునేంత వరకు పోషకాలను ఆకుల ద్వారా అందించే ప్రయత్నంచేయాలి. 20 గ్రాముల యూరియా, లీటరు నీటికి కలిపి పిచికారిచేస్తే తాత్కాలికంగా నీటి ఎద్దడిని తట్టుకుని, ఆకుల ద్వారా నత్రజని పోషకం మొక్కలకు అందుతుంది. దీని తర్వాత మూడు పంతొమ్మిదులు 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారిచేస్తే మొక్కల్లో భాస్వరం లోపించకుండా నివారించవచ్చు. విత్తిన నెలరోజులకు అంతరకృషి సాధ్యం కానప్పుడు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా వుంటే వీటి నివారణకు ఎకరాకు 500 గ్రాముల 2,4డి సోడియం సాల్ట్ , 200 లీటర్ల నీటిలో కలిపి చాళ్లలో పిచికారిచేయాలి. మొక్కల మధ్య వున్న కలుపును కూలీలతో నివారించాలి.
మొక్కజొన్న లో పూత దశ, గింజ పాలుపోసుకునే దశలు కీలకమైనవి. ఈ దశలో నీటి ఎద్దడి వుండకూడదు. విత్తిన 30, 35 రోజులకు, పూతదశలో, పూత వచ్చిన 15 రోజులకు , గింజ పాటు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకు 1 -2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా3 ఉదయం వేళలో ఆకులు చుట్టు చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి అవశ్యకత ఉన్నట్లు గమనించి నీటి తడి ఇవ్వాలి.
READ ALSO : La Tomatina Festival : అక్కడ ఏటా టమాటాలతో కొట్టుకుంటారు.. ఎందుకో తెలుసా?
ప్రస్థుతం అనేక ప్రాంతాల్లో మొక్కజొన్నను కాండం తొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగు బెడద ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. ఒకవేళ మొక్కలు తట్టుకుని నిలబడినా పొత్తు సైజు తగ్గిపోయి ఆశించిన దిగుబడి పొందటం కష్టం. ఈ పురుగు మొక్క మొలకెత్తిన 10 నుండి 20 రోజుల దశ నుంచే ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపై వున్న పత్రహరితాన్ని గోకి తింటాయి. తర్వాత ముడుచుకొని వున్న ఆకుల ద్వారా కాండంలోకి చేరతాయి. ఆకులు విచ్చుకున్న తర్వాత పొడవాటి చిల్లులు వరుస క్రమంలో ఆకులపై కన్పిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినటం వల్ల మొక్క చనిపోయి, ఎండిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్ అంటారు. ఈ దశలో మొవ్వును లాగితే తేలిగ్గా వూడి వస్తుంది. తర్వాతి దశల్లో ఇవి పూతను, కంకిని ఆశించటం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది.
READ ALSO : ఆందోళన లక్షణాలు
కాండంతొలుచు పురుగు ఆశించినట్లు గమనిస్తే.. నివారణకు పొలంలో కలుపు, చెత్తా చెదారం లేకుండా జాగ్రత్త వహించాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పైరు 30 రోజుల దశలో ఎకరాకు 3 కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను మొక్కల మొవ్వు సుడులలో వేయాలి. దీనివల్ల మొక్క విషతుల్యమై పురుగు చనిపోతుంది. లేదా మోనోక్రోటోఫాస్ 1.6మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారిచేయాలి. ఈ విధంగా సమయానుగణంగా మేలైన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే మొక్కజొన్న నుంచి ఆశించిన ఫలితాలు పొందవచ్చు.