Bacteria in Banana Farming
Banana Farming : ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. సంవత్సరం పొడవునా నాటే అవకాశం వున్నప్పటికీ ఏప్రెల్ నుంచి ఆగష్టు మధ్యకాలంలో (Banana Farming) ఎక్కువగా నాటతారు. ప్రస్థుతం వివిధ దశల్లో వున్న అరటి తోటల్లో, బాక్టీరియా దుంపకుళ్లు ఉధృతంగా కన్పిస్తోంది. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ తెగులు వ్యాప్తి, రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇప్పుడు చూద్దాం..
Read Also : Poultry Farming : పెరటి కోళ్ళ పెంపకం ప్రారంభించడం ఎలా..?
అరటికి బాక్టీరియా దుపం కుళ్లు ఎక్కువగా ఆశిస్తుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే తెగులు ఉధృతి అధికమవుతుంది. పెద్ద మొక్కలలో కూడా ఈ తెగులు అధిక నష్టం కలుగజేస్తుంది. ఈ తెగులు లక్షణాలు పనామా తెగులును పోలి ఉంటాయి. కాండం మొదలులో, భూమికి దగ్గరగా కుళ్లు మచ్చలు ఏర్పడి క్రమేపి దుంపకు కుళ్లిపోతుంది. కొత్తగా నాటిన పిలకలలో, చిన్న మొక్కలలో మొవ్వు ఆకు కూడా కుళ్లి పోవటం వల్ల, మొక్క చనిపోతుంది. పెద్ద మొక్కలలో కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడుతాయి.
దుంపపై భాగం కుళ్లిన వాసన వస్తుంది. క్రింది వరుస ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయి, మొక్క చనిపోతుంది. పిలకలకు కూడా ఈ తెగులు వ్యాప్తి చెందుతోంది. ఈ తెగులు తట్టుకోలేని పచ్చ అరటి , తెల్ల చక్కెర కేళి కాలను ఫిబ్రవరి నుండి జూన్ నెలల మధ్య నాటకోరాదు.
వేసవిలో తోటలకు సరిపడు నీరు పెట్టాలి. కొత్తగా తోటలు వేయడానికి తెగులు సోకనటువంటి ఆరోగ్యవంతమైన ప్రాంతాల నుండి మాత్రమే పిలకలు సేకరించాలి. సేకరించిన పిలకలను కాపర్ ఆక్సీక్లోరైడ్ , మోనోక్రోటోఫాస్ కలిపిన నీళ్ళలో ముంచి నీడలో ఆరబెట్టిన తరువాత నాటుకోవాలి.
తోటల్లో తెగులు సోకిన మొక్కలను దుంపలతో సహా తీసివేసి తోట బయట చిన్నముక్కులగా నరికి ఎండుతుక్కు వేసి తగలబెట్టాలి. మొక్కలు తీసివేసిన చోటల, చుట్టు ప్రక్కల ఆరోగ్యవంతమైన మొక్కల మొదళ్ళవద్ద మట్టి బాగా తడిసేలా బ్లీచింగ్ పౌడర్ 25 గ్రా. లీటరు నీటిని కలిపిన ద్రావణాన్ని పోయాలి. లేదా సూడోమోనాస్ 50 గ్రాములు లీటరు నీటికి కలిపి ప్రతి మొక్కకి పోయాలి. ఈ తెగులు సమస్యాత్మకంగా మారిన నేలల్లో వరి, చెరకు లాంటి పంటతో పంట మార్పిడి చేయాలి.
Read Also : Sheep Farming : చలికాలంలో గొర్రెలకు పెరగనున్న వ్యాధులు – నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు