Prevention Of Pests in Vegetable Gardens
Vegetable Gardens : వాతావరణ పరిస్థితుల కారణంగా కూరగాయల పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. ఇవి ఆశించిన తోటల్లో పెరుగుదల తగ్గుతుంది. అరకొర దిగుబడులు వచ్చినా అవి నాణ్యత కోల్పోతాయి. దీంతో సరైన ధర మార్కెట్ లో రాదు. కాబట్టి రైతులు వీటిని గమనించిన వెంటే, నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను ఇప్పుడు చూద్దాం…
మనం నిత్యం తీసుకునే ఆహారంలో కూరగాయలకు చాలా ప్రాధాన్యముంది. కూరగాయలను వర్షాధారంగా, ఆరుతడి పంటలుగా సాగు చేస్తుంటారు. ప్రస్తుత వాతావరణ మార్పులు కారణంగా వంగ, మిర్చితో పాటు పలు కూరగాయల పంటలకు వివిధ రకాల తెగుళ్లు, పురుగులు ఆశిస్తున్నాయి.
ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించి తీవ్రనష్టం చేస్తున్నాయి. వీటి నివారణకు డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ఎపిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. చాలా చోట్ల ఆకుమచ్చ తెగుళ్లు ఆశించింది. దీని నివారణకు కార్చెండిజమ్ 1 గ్రా. లేదా ప్రోసికోనజోల్ 1 మి. లీ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
వంగలో కొమ్మ, కాయతొలుచు పురుగు ఉధృతి పెరిగింది. రైతులు లింగాకర్షన బుట్టలను అమర్చి పురుగు యొక్క ఉధృతిని పర్యవేక్షించుకోవాలి. పురుగు సోకిన కొమ్మలను త్రుంచి వెంటనే నాశనం చేయాలి. వీటి నివారణకు ప్రోఫెనోఫాస్ 2 మిలీ. లేదా ఇమమెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. కూరగాయల పంటలలో పొగాకు లద్దె పురుగు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వీటిని అరికట్టేందుకు నోవాల్యూరాన్ 1.25 మి. లీ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మిరపలో కూడా బాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్లు ఆశించి పంటను నాశనం చేస్తోంది. దీనిని ఎదుర్కొనేందుకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రా . ప్లాంటమైసిన్ 1 గ్రా. మందును 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధితో 2సార్లు పిచికారి చేయాలి.
అలాగే, కోయినోఫొర కొమ్మకుళ్లు తెగులు ఆశిస్తే పంట దిగుబడిపై పడే అవకాశం ఉంది. దీని నివారించేందుకు 3. గ్రా. పైరాక్లోస్ట్రోబిన్, మెటిరామ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో ఎక్కువగా తామరపురుగు పూతను ఆశించడం వల్ల పూర్తిగా పంట దెబ్బతింటుంది. దీనికి అరికట్టేందుకు ఫిప్రోనిల్ 2 మి.లీ .మందును లీటరు నీటికి కలిపి సకాలంలోపిచికారి చేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..