Quail Birds Farming : కౌజు పిట్టల పెంపకంతో.. 45 రోజుల్లోనే మస్తు లాభాలు

Quail Birds Farming Business : పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసం ఉత్పత్తి కావడంలేదు. మార్కెట్‌లో మాంసానికి విపరీతమైన డిమాండ్‌ ఉంది.

Quail Birds Farming Business

Quail Birds Farming Business : కౌజు పిట్టల పెంపకం సన్న, చిన్నకారు రైతులకు, నిరుద్యోగులకు  ఉపాధినిచ్చే పరిశ్రమగా, మంచి ఆదరణ పొందుతోంది.  దేశంలో చాలా చోట్ల వీటి గ్రుడ్లకు, మాంసానికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. కొద్దిపాటి స్ధలం, తక్కువ ఖర్చు, శ్రమతో ఐదారు  వారాల్లోనే ఈ పక్షులను మార్కెట్ చేసే అవకాశం వుండటంతో రైతులకు వీటి పెంపకం అన్నివిధాలా అనుకూలంగా మారింది. అయితే కొత్తగా పెట్టాలనుకునే వారు ఎలాంటి కౌజు పిట్టల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని పీవి నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. పురుషోత్తం.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసం ఉత్పత్తి కావడంలేదు. దీంతో మార్కెట్‌లో మాంసానికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. మాంసాహారం కొరకు జంతువులను, పక్షులను పెంచడము అనాదిగా వస్తున్నది. కాని పక్షుల విషయంలో అనాదిగా వున్నది కోళ్ళను పెంచడము. కోళ్ళలో బ్రాయిలర్ కోళ్ళు, గ్రుడ్లు పెట్టే కోళ్ళు, గిన్నీ కోళ్ళు,  ఈము పక్షులు, కౌజు పిట్టల పెంపకం చేపడుతున్నారు. ఇందులో  ముఖ్యంగా  కౌజు పిట్టల మాంసానికి మంచి డిమాండ్‌ ఉంది.  కోడిమాంసం కంటే కూడా దీని మాంసం రుచితో పాటు, కొవ్వు పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలకు ఈ మాంసం, శరీర మరియు మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడటమే కాకుండా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, కౌజు పిట్ట మాంసం ఒక పౌష్టికాహారం.

గతంలో రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువులు , జీవాలు , కోళ్ళపెంపకాన్ని చేపట్టి ఆరోగ్యమైన జీవనాన్ని పొందేవారు. కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పువచ్చి ఒకేపంట విధానాన్ని చేపట్టారు. అయితే ఇందులో మొదట్లో లాభాలు వచ్చినా.. రానురాను నష్టాలు అధికమవడంతో వాటిని పూడ్చుకునేందుకు అనుబంధ రంగాలలైన  మేకలు, గొర్రెల, ఆవులు, గేదెలు, కోళ్ల  పెంపకాన్ని చేపట్టారు.  అయితే సన్నా ,చిన్నకారు రైతులు, గ్రామీణ నిరుద్యోగ యువత అంత పెట్టుబడి పెట్టలేక పోవడం, పౌల్ట్రీకి అనుబంధంగా ఉన్న కౌజు పిట్టల పెంపకం.. తక్కువ ఖర్చు.. తక్కువ పెట్టుబడి.. తక్కువ స్థలంలోనే పెంచే వీలుండటం.. ఇటు, మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో వీటి పెంపకానికి  ఆసక్తి చూపుతున్నారు.

ఒక కోడిని పెంచే స్థలంలో సుమారు 8 – 10 క్వయిల్‌ పక్షులను పెంచవచ్చు. ముఖ్యంగా గుడ్లనుండి పొదిగబడిన క్వయిల్ పిల్లలు చాలా చిన్నవిగా సున్నితంగా ఉంటాయి. వీటిని సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పెంచడానికి వీలుకాదు. కాబట్టి బ్రూడింగ్ పద్ధతులను చేపట్టి పక్షులను ఆరోగ్యంగా ఉంచాలి. పోషణకయ్యే ఖర్చు మొత్తం క్వయిల్ ల పెంపకానికయ్యే ఖర్చులో సుమారు 70 శాతం పైగా ఉంటుంది. అంతే కాక సరైన పెరుగుదలకు , అధిక గుడ్ల ఉత్పత్తికి శాస్త్రీయ పద్ధతిలో పోషకాహారం ఇవ్వడం చాలా అవసరం. ఇటు క్వయిల్ పక్షుల పెంపకం యాజమాన్య పద్ధతులు మాంసపు రకానికి గాని, గుడ్ల రకానికి గాని తేడా ఉండదు. మాంసానికి పెంచే క్వయిల్స్ 5 వారాల వయస్సు నుండి అమ్మటం ఉత్తమం.

Read Also : Orange Crop Farming : ప్రస్తుతం బత్తాయి తోటల్లో వేయాల్సిన ఎరువులు