Rearing goats in elevated sheds
Rearing Goats : మన దేశంలో ఎంతో మంది గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకుని జీవిస్తున్నారు. అయితే ఇంకా సంప్రదాయ పద్ధతిలనే అనుసరించటం వల్ల, ఆశించిన లాభాలు గడించలేకపోతున్నారు. దీనికితోడు తగ్గిపోతున్న పచ్చిక బయళ్లు, పెరిగిన నగరీకరణ, వాతావరణ ప్రతికూలత వల్ల ఆరుబయట జీవాల పెంపకం కత్తిమీద సాములా వుంది. ఈ నేపధ్యంలో ఎలివేటెడ్ విధానంలో పలు జాతుల మేకలు పెంచుతూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు నారాయణ పేట జిల్లాకు చెందిన ఓ యువకుడు.
గొర్రెలు, మేకల పెంపకం అనాదిగా వ్యవసాయానికి అనుబంధంగానే కాకుండా వృత్తిగానూ కొనసాగుతున్నది. వీటి పెంపకానికి గ్రామాలను ఆనుకొని ఉన్న బంజర్లు, బీడు భూములు, అటవీ భూములే ప్రధాన ఆధారంగా ఉండేవి. అయితే, పట్టణాలు, నగర పంచాయతీల శివారు భూముల్లో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలువడటంతో గొర్రెలు, మేకలకు మేత కరువైంది. దీంతో గొర్రెలు, మేకల పెంపకం కుంటుపడింది. ఇటు మార్కెట్ లో మాంసానికి డిమాండ్ పెరిగింది.
ఈ నేపధ్యంలోనే అక్కడక్కడ కొంత మంది యువకులు సాంద్ర పద్ధతిలో మేకల పెంపకం చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ కోవకు చెందిన వారే నారాయణ పేట జిల్లా, మరికెల్ మండలం, ఎలిగండ్ల గ్రామానికి చెందిన యువకుడు ముజాద్ అహ్మద్. తనకున్న మామిడితోటలో రెండు ఎలివేటెడ్ షెడ్లను ఏర్పాటు చేసి.. అందులో దేశ, విదేశాలకు చెందిన పలు మేకజాతులను పెంచుతున్నారు.
జీవాల పోషణ అతి ముఖ్యమైంది. పెంపకం లాభసాటిగా ఉండాలంటే వాటికి అందించే మేతతోనే ముడిపడి ఉంటుంది. అందుకే ముజాద్ పలు రకాల గడ్డి రకాలను పెంచుతూ.. వాటిని మేకలకు అందిస్తున్నారు. వీటితో పాటు మిశ్రమ దాణా ఇస్తున్నారు. తద్వారా మేకలు త్వరగా పెరిగడంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..