Janumu Seed Production : జనుము విత్తన ఉత్పత్తిలో మెళకువలు

Janumu Seed Production : జనుము విత్తన ఉత్పత్తిలో మెళకువలు

Techniques In Janumu Seed Production

Janumu Seed Production : రసాయన ఎరువులు, పురుగు మందులతో భూసారం తగ్గిపోతున్నది. పంటలకు పనికి రాకుండా నేల తయారవుతున్నది. ఈ తరుణంలో భూమిలో పోషకాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. పొలంలో పచ్చిరొట్ట సాగుచేయడం ద్వారా.. నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. అయితే ప్రతి సారి విత్తనం కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. రబీలో సాగుచేసే రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోవాలంటే ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

పచ్చిరొట్టను సాగు చేయడం ద్వారా నేలలో సూక్ష్మజీవుల సాంద్రత పెరిగి, పంటలకు పోషకాల లభ్యత పెరుగుతుంది. అంతే కాకుండా నేల భౌతిక, రసాయనిక పరిస్థితులు మెరుగుపడతాయి. నీరు నిల్వ ఉండే పొలాలతోపాటు భీడు భూముల్లో పచ్చిరొట్ట సాగు ద్వారా నేల భౌతిక లక్షణాలు మెరుగుపడుతాయి. ఇతర పంటలు పండించడానికి అనువుగా మారుతాయి. అయితే రైతులు ఎక్కువగా ప్రైవేట్ విత్తన కంపెనీలు, ప్రభుత్వ సబ్సిడి విత్తనాలపైనే ఆధార పడి సాగుచేస్తున్నారు. అవి అందుబాటులో లేకపోవడంతో ఎక్కువగా రసాయన ఎరువులపైనే ఆధారపడి పెట్టుబడి ఖర్చులను పెంచుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో రైతులే స్వంతంగా పచ్చిరొట్ట పైర్ల విత్తనాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైతులు రబీలో అధికంగా జనుమును సాగుచేస్తుంటారు. పచ్చిరొట్టగానే కాకుండా విత్తన ఉత్పత్తితో అదనపు ఆదాయంతో పాటు భూసారం పెంపొందించుకోవచ్చని విత్తనోత్పత్తిలో మెళకువలను తెలియజేస్తున్నారు అనకాపల్లి జిల్లా, యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శిరీష.

సాధారణంగా రైతులు నీటివసతి ఉన్న ప్రాంతాల్లో ఒక ఖరీఫ్లోనే పచ్చిరొట్ట పైర్లను సాగుచేసి, ప్రధాన పంటల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను పెంపొందించుకుంటుంటారు. మెట్టప్రాంతాల్లో కూడా ఈ పైర్లను సాగుచేసి ఎరువుల వాడకంతో పాటు సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు సూచిస్తున్నారు శాస్త్రవేత్త.