cotton crop
Pest Control : రైతులు పండించే పంటలను చీడపీడలనుండి కాపాడుకోవటం పెద్ద సవాలుగా మారింది. చీడపీడల నివారణకు పెద్ద మొత్తంలో వ్యయం చేయాల్సి వస్తుంది. పురుగుల నివారణకు వినియోగించే హానికరమైన రసాయనాల వల్ల పర్యావరణం దెబ్బతినటంతోపాటు, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పర్యావరణ సమతుల్యము దెబ్బతినకుండా పైరులను ఆశించే వివిద చీడపీడలను అంచనాలు వేసి వాటివల్ల పంటలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్కువ ఖర్చుతో సేద్యపద్ధతుల ద్వారా ,యాంత్రిక పద్ధతుల ద్వారా, జీవ నియంత్రణ పద్దతుల ద్వారా అధిక దిగుబడులు సాధించటంపై శాస్త్రవేత్తలు కొంతకాలంగా పరిశోధనలు సాగిస్తున్నారు.
READ ALSO : Soybean Cultivation : సోయాబీన్ సాగులో చీడపీడలు సస్యరక్షణ చర్యలు!
ఈ క్రమంలోనే పురుగుల సంతతినే పెరగకుండా అరికట్టగలిగితే రైతులకు శ్రమ, ఖర్చు తగ్గటంతో పాటు, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కూడా మేలు కలిగేలా సరికొత్త సాంకేతికతను శాస్త్రవేత్తలు రూపొందించారు. పంట పొలాల్లో, పండ్ల తోటల్లో పురుగుల నియంత్రణకు పురుగుమందులు/కషాయాలు చల్లటానికి బదులుగా ఈ సాంకేతికతను ఉపయోగించి వాటి సంతతిని కట్టడి చేయవచ్చు.
పురుగుల సంతతిని అరికట్టటమే లక్ష్యంగా ;
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న సాంకేతికత ప్రకారం కృత్రిమ ఫెరమోన్‌తో కూడిన ప్రత్యేక పేస్ట్‌ను రూపొందించారు. ఈ పేస్ట్‌ను పంట పొలంలో మొక్కలకు అక్కడక్కడా అంటించాల్సి ఉంటుంది. ఈ పేస్ట్ వాసనకు ఆకర్షితులై మగ రెక్కల పురుగు ఆడ పురుగు ఉందనుకొని మొక్కపై ఉన్న పేస్ట్ దగ్గరకు చేరుతుంది. ఆడపురుగు లేకపోవటాన్ని చూడి తికమక పడుతుంది. ఆడ రెక్కల పురుగులను కలిసే ప్రయత్నంలో విఫలం చెందుతుంది. తద్వారా వాటి సంతానోత్పత్తిని నిరోధించవచ్చు. పంట వేసిన తొలికాలంలోనే పేస్ట్‌ను పొలంలో అక్కడక్కడా మొక్కలకు పూస్తే పురుగుల్ని నిర్మూలించే మందులను వాడకుండానే వాటి సంఖ్యను అదుపు చేయవచ్చు. తద్వారా పంటకు నష్టం కలగకుండా కాపాడుకోవచ్చు.
READ ALSO : Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !
ఈ పేస్ట్ కు సంబంధించిన సాంకేతికత విషయానికి వస్తే ఆడ రెక్కల పురుగు సంతానోత్పత్తి దశలో మగ రెక్కల పురుగును ఆకర్షించడానికి ప్రత్యేకమైన వాసనతో కూడిన హార్మోన్ వంటి రసాయనాన్ని గాలిలోకి వదులుతుంది. మగ పురుగు వాసనను బట్టి ఆడ పురుగు ఉన్న చోటుకు వెళుతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు మగపురుగులను ఆకర్షించటానికి వెదజల్లే రసాయన వాసనను పేస్ట్ రూపంలో తీసుకువచ్చారు. ఈ పేస్ట్ వల్ల పురుగులకు హానికలగకుండా వాటి సంతతి పెరుగుదలను అరికట్టడం ఈ సాంకేతికత యొక్క ముఖ్య ఉద్దేశం.
ప్రస్తుతం బీటీ పత్తి పొలాల్లో విజృంభిస్తున్న గులాబీ లద్దె పురుగును అరికట్టేందుకు ప్రత్యేకమైన పేస్ట్‌ను హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోని ఎటిజిసి బయోటెక్ కంపెనీ రూపొందించింది. ప్రస్తుతం దీనిని మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ పేస్ట్ పత్తిలో గులాబీ పురుగులను సమర్ధవంతంగా అరికట్టేందుకు ఉపయోగించ్చు. ఇప్పటి వరకు పురుగుల తీవ్రతను తెలుసుకునేందుకు లింగాకర్షక బుట్టలు రైతులు వాడుతున్నారు. ఈ కొత్త పద్ధతి ద్వారా ఈ పురుగుల సంతతి పెరగకుండా పంటప్రారంభం నుండే వాటి కలయికను నివారించవచ్చు.
READ ALSO : Rice Cultivation : వరిలో అధిక దిగుబడులకోసం సమగ్ర యాజమాన్యం
పత్తిపంట సాగులో ముఖ్యంగా చీడపీడల నివారణకోసమే రైతులు పెద్ద మొత్తంలో వ్యయం చేయాల్సి వస్తుంది. గులాబీ పురుగు వల్ల రైతులు పంట ఉత్పత్తి తగ్గుతుంది. ఫెరోమోన్ అధారిత పేస్ట్ ద్వారా పురుగుల ఉధృతిని సులభంగా తగ్గించుకోవచ్చు. పంటకాలంలో మూడు సార్లు ఈ పేస్ట్ ను పొలంలో బాఠాణీ గింజంత మొక్కలకు పూస్తే సరిపోతుంది. ఎకరం పొలానికి 125 గ్రాముల పేస్ట్ సరిపోతుంది. 30-35 రోజులకు మొదటిసారి, విత్తిన 60-65 రోజుల తర్వాత రెండోసారి, విత్తిన 90-95 రోజుల తర్వాత మూడవ సారి పేస్ట్ పూయాలి. ఇలా చేస్తే పంట ఖర్చు తగ్గి, దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. ఎకరానికి పేస్ట్ ఖర్చు మూడు సార్లకు రూ. 4 వేలు అవుతుంది.
ఫెరోమోన్ అధారిత పేస్ట్ సాంకేతికతలో పురుగుమందులు /హానికరమైన రసాయనాల వినియోగం లేదనందున పర్యావరణానికి ఎలాంటి హానిజరుగదు. మిత్ర పురుగులు సురక్షితంగా ఉంటాయి. తేనెటీగలకు హానికలుగదు. త్వరలో వంగ, మొక్కజొన్న వంటి పంటలలో కత్తెర పురుగుకు నియంత్రించేందుకు పేస్ట్ ను రూపొందించనున్నారు.