Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !

భూమిలో తేమ అధికంగా ఉన్నట్లయితే వేరుకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల లేత మొక్కలు అర్ధంతరంగా ఎండిపోతాయి.

Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !

Prevention of pests and diseases in Chamanti cultivation!

Chamanti Cultivation : శీతాకాలంలో అనుకూలంగా ఉండే పంట చామంతి. తేలికపాటి నేలలు, ఉదజని సూచిక 6.5 నుండి 7.0 మధ్య కలిగిన నేతలు అనుకూలంగా సాగుకు అనుకూలంగా ఉంటాయి. జూన్ , జులై మాసాల్లో చామంతి మొక్కలు నాటుకోవాలి. నవంబర్ నాటికి పూలు పూస్తాయి. పండుగలు, పర్వదినాలతోపాటు సౌందర్య ఉత్పత్తుల్లోనూ చామంతిని ఉపయోగిస్తారు. ఏడాది పొడవునా డిమాండ్‌ ఉంటుంది. పిలకలు, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. పూలు కోయటం పూర్తయిన తరువాత ఫిబ్రవరి, మార్చి మాసాల్లో మొక్కల కొమ్మలు కత్తిరించి ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూలు నాణ్యత బాగుంటుంది.

మొక్కలను 30 నుండి 20 సెం.మీ ఎడంలో నాటుకోవాలి. ఎకరానికి 60 వేల మొక్కలవరకు నాటుకోవచ్చు. నారు నాటిన నాలుగు వారాల తరువాత చామంతి మొక్కల తలలు తుంచుకోవాలి. ఇలా చేయటం వల్ల పెరుగుదల ఆగి పక్క కొమ్మలు ఏర్పడతాయి. దీని వల్ల పూలదిగుబడి బాగా పెరుగుతుంది. 20 రోజులకోసారి క్రిమిసంహారక మందులను పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. నాటిన మొదటి 30 రోజులు మొక్కలు బాగా ఏపుగా పెరిగేలా జాగ్రత్తలు పాటించాలి.

పువ్వుల పరిమాణం పెరగటానికి తలలు కత్తిరించిన 20 నుంచి 25 రోజులకు లీటర్‌ నీటిలో 50 పీపీఎం జిబ్బరెల్లిక్‌ ఆమ్లం కలిపి పిచికారీ చేయాలి. లియోసిన్‌ మందును పిచికారీ చేస్తే మొగ్గ సైజు పెరుగుతుంది. పండుగలు, పర్వదినాల్లో పంట చేతికి వస్తే అధిక లాభాలు పొందవచ్చు. దీనికోసం మొగ్గ దశకు ముందే లీటర్‌ నీటిలో 100 పీపీఎం నాఫ్తాలిక్‌ ఎసిటిక్‌ ఆమ్లం 100 మిల్లీగ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

చామంతిలో సస్యరక్షణ చర్యలు ;

చీడపీడలు, తెగుళ్ళ నివారణ ;

ఆకుమచ్చ తెగులు ; ఆకులమీద వలయాకారంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. సెర్కోస్పొరా ఆకుమచ్చ వల్ల ఆకుల మీద ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి, చుట్టూ ఎరుపు వర్ణంతో మధ్యభాగం తెల్లగా ఉంటుంది. ఈ తెగులు నివారణకు లీటర్‌ నీటిలో 2.5 గ్రా.మంకోజెబ్‌ లేదా 3గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ కలిపి 15రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

వేరుకుళ్లు తెగులు ; భూమిలో తేమ అధికంగా ఉన్నట్లయితే వేరుకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల లేత మొక్కలు అర్ధంతరంగా ఎండిపోతాయి. ఈ తెగులు నివారణ కోసం లీటర్‌ నీటిలో 3గ్రా.కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా 1గ్రా. కార్బెండజిమ్‌ కలిపి, తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేలపై పోయాలి.

తుప్పు తెగులు ; చలికాలంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. ఆకులపై తుప్పు రంగులో చిన్న మచ్చలు ఏర్పడి, తర్వాత పై ఆకులకు, పువ్వులో పచ్చని భాగాలకు వ్యాపిస్తుంది. తద్వారా మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఈ తెగులు నివారణకు లీటర్‌ నీటిలో 2గ్రా. మాకోజెబ్‌ కలిపి పిచికారీ చేసుకోవాలి.

తామర పురుగులు ; ఇవి గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి వడపడిపోతాయి. పూలు కూడా వాడిపోతాయి. ఈ పురుగుల నివారణకు లీటర్‌ నీటిలో 1.5 మి.లీ. డైమిథోయేట్‌ లేదా 3 గ్రా. కార్బరిల్‌ 50 శాతం పొడిని కలుపుకుని పిచికారీ చేయాలి.

పచ్చ పురుగు ; పచ్చ గొంగళి పురుగులు ఆకులను తినడంతోపాటు పూలను నాశనం చేస్తాయి. వీటి నివారణ కోసం ఎకరానికి మలాథియాన్‌ 5 శాతం పొడి 8 కిలోలు లేదా క్వినాల్ఫాస్‌ పొడి 8 కిలోలు చల్లుకోవాలి. లేదా లీటర్‌ నీటిలో 2 మి.లీ. ఎండోసల్ఫాన్‌ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి.