Amberpet SI Case : అంబర్‌పేట్ ఎస్ఐ కేసులో షాకింగ్ నిజాలు.. బంగారం నొక్కేసి లోక్ అదాలత్‌లో కేసు క్లోజ్.. తుపాకీ ఎక్కడ తాకట్టు పెట్టాడంటే?

Amberpet SI Case : హైదరాబాద్ అంబర్‌పేట్ ఎస్ఐ తుపాకీ మిస్ అయింది. ఎస్ఐ భానుప్రకాశ్ గన్‌ను తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Amberpet SI Case : అంబర్‌పేట్ ఎస్ఐ కేసులో షాకింగ్ నిజాలు.. బంగారం నొక్కేసి లోక్ అదాలత్‌లో కేసు క్లోజ్.. తుపాకీ ఎక్కడ తాకట్టు పెట్టాడంటే?

Amberpet SI Case

Updated On : November 26, 2025 / 11:55 AM IST

Amberpet SI Case : హైదరాబాద్ అంబర్‌పేట్ ఎస్ఐ కేసులో దర్యాప్తు చేస్తున్నాకొద్దీ షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఐ భానుప్రకాశ్ బరితెగింపు పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా మారింది.

ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌ను తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ చోరీ కేసులో రికవరీ సోమ్ముకూడా వాడుకున్నట్లు, బంగారంను తాకట్టు పెట్టినట్లు భానుప్రకాశ్ పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎస్ఐను సస్పెండ్ చేశారు. భానుప్రకాశ్‌పై అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన్ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రికవరీ బంగారంను నొక్కేసి లోక్ అదాలత్ లో కేసు క్లోజ్ చేసినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. దీంతో ఐదు తులాల బంగారం రికవరీ చేసి సొంతంగా వాడుకున్నట్లు తేల్చారు. సర్వీస్ 9ఎంఎం పిస్టల్ మిస్సింగ్ వ్యవహారం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. తుపాకీని రాయలసీమ ముఠాలకు అమ్మేశాడా..? దానిని ఎక్కడ తాకట్టు పెట్టాడు అనే విషయాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. డ్రాలో బుల్లెట్స్ మాత్రమే ఉన్నాయి. తుపాకీ కనిపించలేదు.

ఎస్ఐ భాను ప్రకాశ్ బెట్టింగ్ లకు బానిసై భారీగా అప్పులపాలైనట్లు తెలుస్తోంది. సుమారు 70 నుంచి 80లక్షల మేర అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. దీంతో ఆయన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అడ్డదారులు తొక్కాడు. ఓ రికవరీ కేసులో స్వాధీనం చేసుకున్న సుమారు ఐదు తులాల బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

భాను ప్రకాశ్‌ను విచారించే క్రమంలో సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించక పోవటంతో ఆ విషయంపై ప్రశ్నించారు. అతను పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కేసు నమోదు చేశారు. ఆ తరువాత లోతుగా విచారించగా.. బంగారంతోపాటే తుపాకీని కూడా ఓ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎస్సై భానుప్రకాశ్ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తుపాకీ మిస్సింగ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం భాను ప్రకాశ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.