రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం దాదాపుగా అయిపోయిందని..ఇప్పుడు నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం ముందే చెప్పిందన్నారు.
రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం దాదాపుగా అయిపోయిందని..ఇప్పుడు నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా శనివారం (జనవరి 11, 2020) ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి బాలినేని మాట్లాడుతూ రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం ముందే చెప్పిందన్నారు. దురుద్ధేశంతోనే ప్రభుత్వంపై టీడీపీ ఆరోపణలు చేస్తోందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్ల రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
మరోవైపు మూడు రాజధానులు వద్దు… అమరావతే ముద్దు… అనే నినాదంతో ఏపీ రాజధాని గ్రామాల్లో రైతులు హోరెత్తారు. నిన్న యుద్ధ వాతావరణాన్ని తలపించిన క్యాపిటల్‌లో ఇవాళ కూడా రైతులు కదం తొక్కబోతున్నారు. మొన్నటివరకు ర్యాలీలు, పాదయాత్రలు, ధర్నాలు, బైఠాయింపులతో రైతుల నిరసనగా తెలపగా… నిన్న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు పూజలు చేయాలన్న కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అలజడి రేగింది. మహిళలపై లాఠీఛార్జ్ చేయడం, కొందరు గాయపడటం లాంటి ఘటనలు మరింత హీటు పెంచాయి. ఈ తరుణంలో… 25వరోజు నిరసనలో భాగంగా ఇవాళ బైక్ ర్యాలీకి సిద్ధమయ్యారు రైతులు. మరోవైపు… అమరావతి పరిణామాలను సుమోటాగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్…ఇవాళ రాజధాని గ్రామాల్లో పర్యటించనుంది.
మరోవైపు…. మందడం, తుళ్లూరులో రైతులు మహా ధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలేదీక్షలు కంటిన్యూ అవుతున్నాయి. ఉద్దండరాయునిపాలెంలోను వివిధ గ్రామాలకు చెందిన రైతులు నిరసనలు తెలుపుతున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెంతోపాటు ఇతర గ్రామాల్లోను ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటి ఘటనలో గాయపడిన వారు… గాయాలకు కట్టిన కట్లతో నిరసన తెలియజేస్తున్నారు.
రాజధాని గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ రైతులు బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. మందడం నుంచి విజయవాడలోని గుణదల వరకు ర్యాలీకి సిద్ధమయ్యారు. అయితే… ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు జరపవద్దని సూచిస్తున్నారు. ముందుజాగ్రత్తగా అమరావతి గ్రామాలన్నింటిలో భారీగా పోలీసులను మోహరించారు. బైక్ ర్యాలీని అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే… ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని రైతులు నిర్ణయించారు.