Dogs Poisoned
Dogs Poisoned : పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మూగజీవాల పట్ల అధికారులు నిర్ధయగా వ్యవహరించారు. ఎలాంటి కనికరం చూపకుండా విషపు ఇంజక్షన్లతో చంపేశారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 మూగజీవాలను హతమార్చారు. అంతేకాదు కళేబరాలను ఓ గొయ్యిలో పడేశారు. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు. మూగజీవాల పట్ల అధికారుల తీరు దుమారం రేపింది. లింగపాలెం పంచాయతీ అధికారులు 300 కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
ఈ ఘటన జంతు ప్రేమికులను తీవ్రంగా బాధించింది. వారు దీన్ని తప్పుపడుతున్నారు. కుక్క విశ్వాసానికి మారుపేరు. కొన్ని సందర్భాల్లో అవి మనుషులపై దాడి చేయవచ్చు, తీవ్రంగా గాయపరచవచ్చు. అంతమాత్రాన అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తారా? వాటిని వదిలించుకునేందుకు చంపేస్తారా? అని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. కుక్కలను చంపే హక్కు ఎవరిచ్చారని ఫైట్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ ప్రశ్నిస్తోంది. ఈ చర్యలకు పాల్పడ్డ పంచాయతీ అధికారులపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పంచాయతీ అధికారుల వివరణ మరోలా ఉంది. కుక్కలు తరచూ దాడులకు తెగపడుతున్నాయని, ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా పోగై రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ కారణంగానే విషం పెట్టి చంపినట్లు చెబుతున్నారు. ప్రజారోగ్యం రీత్యానే ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు వివరిస్తున్నారు.