Tribals corona fear : కరోనా భయంతో పసిబిడ్డల్ని తీసుకుని అడవిలోకి వెళ్లిపోయిన గిరిజన కుటుంబాలు

కరోనా సోకుంతుందనే భయంతో అడవిని నమ్ముకుని జీవించే గిరిజనులు పసిబిడ్డల్ని కూడా తీసుకుని అడవితల్లి ఒడిలోకి వెళ్లిపోయారు.

70 tribals who went to the forest for fear of corona : అడవితల్లిని నమ్ముకుని జీవించే గిరిజనులు కరోనా సోకుతుందని భయపడి ఆ అడవితల్లి ఒడిలోనే దాక్కువటానికి వెళ్లిపోయారు. పసిబిడ్డలను కూడా తీసుకుని అడవిలో ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లిపోయారు. అక్కడ ఉండే ఓ దేవాలయంలో తలదాచుకుని జీవిస్తున్నారు. ఈ విషయం తెలిసిన అధికారులు వారికి నచ్చ చెప్పి..భరోసా ఇచ్చి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని ధైర్యం చెప్పి తిరిగి వారి ఇళ్లకు తీసుకొచ్చిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగింది. దాదాపు 10 గిరిజన కుటుంబాలు కరోనాకు భయపడి అడవిలోకి వెళ్లిపోయారు.

కరోనా మహమ్మారి భయంతో అడవిలోకి వెళ్లిపోయిన కుటుంబాలు అధికారుల అభయంతో తిరిగి ఇళ్లకు చేరుకోవటానికి అంగీకరించి వారి వారి ఇల్లకు చేరుకోవటంతో అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో..కరోనా కాటేస్తుందన్న భయంతో వెంకటగిరి బొగ్గులమిట్టకు చెందిన 10 గిరిజన కుటుంబాలు వెలిగొండ అటవీ ప్రాంతంలోని కోన మల్లేశ్వరస్వామి కోనకు వెళ్లిపోయాయి. వీరిలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు కలిసి 70 మందికిపైగా ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు కోర్టుకు చెందిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతికుమార్ గురువారం (మే 19,2021) అడవిలోకి వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. దానికి గిరిజనులు భయపడిపోతూ..‘‘కరోనా భయంతో నాలుగు రోజులకు సరిపడా ఆహార పదార్థాలను వెంటతెచ్చుకుని ఇక్కడికి వచ్చేసాం సారూ..కానీ తెచ్చుకున్నవన్నీ రెండు రోజులకే అయిపోయాయి. దీంతో ఏం చేయాలో తెలీక దిక్కు తోచకుండా ఉండిపోయాం సారూ..అంటూ అమాయకంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో..ఎటువంటి భయమూ అక్కర్లేదని..జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదనీ..ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి వివరించి వారిలో ధైర్యం నింపారాయన. అడవిలోకి రావడం ప్రమాదకరమని..ఇళ్లకు వెళ్తే ఆహార పదార్థాలను తామే సరఫరా చేస్తామని హామీ ఇచ్చి వారు తిరిగి ఇళ్లకు చేరుకోవటానికి వాహన సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు అంగీకరించారు.

ట్రెండింగ్ వార్తలు