ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం(4 మే 2020) నుంచి వైన్స్ షాపులు తెరుచుకోగా.. ఈ సారి పెరిగిన మద్యం రేట్లు మందుబాబులకు షాక్ ఇచ్చాయి. మద్యం అమ్మకాలు తగ్గించే క్రమంలో భాగంగా ధరలను 25 శాతం పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం మరో 50శాతం రేట్లు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.
మద్యం కొనుగోలును తగ్గించడం కోసమే ధరలను పెంచామని అంటున్న ఏపీ సర్కారు.. తాజాగా పెంచిన దాంతో మొత్తం 75శాతం పెంచినట్లుగా అయ్యింది. పెరిగిన ధరలు త్వరలోనే అమలులోకి తీసుకుని రానున్నారు.
సోమవారం నుంచి మద్యం షాపులు తెరుచుకోగా.. సామాజిక దూరం పాటించకుండా మద్యం కోసం మందుబాబులు ఎగబడిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయింత్రం 7 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్ అయ్యి ఉన్నాయి.
ఒక్కసారి అయిదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని, షాపుల వద్ద సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని కోరినా కూడా మందుబాబులు పట్టించుకోలేదు. మాస్క్ లేనిదే మద్యం దుకాణాలకు అనుమతి లేదని వెల్లడించినప్పటికీ నిబంధనలు పాటించకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మద్యపానాన్ని నిరుత్సాహపరిచే దిశగా ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని.. ఈ నెలాఖరులోగా మరో 15శాతం మద్యం దుకాణాల తగ్గింపునకు నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే తాత్కాలికంగా అమ్మకాలు కూడా ఆపివేసింది ప్రభుత్వం.
Also Read | మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్, మద్యం ధరలు 25శాతం పెంపు