Kia Car Engines Stolen: ఏపీలో సంచలనం రేపిన కియా కార్ల ఇంజిన్ల మాయం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 900 కార్ల ఇంజిన్ల మాయం కేసులో 9 మందిని స్పెషల్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి వారందరిని పెనుకొండకు తీసుకొచ్చారు. అరెస్ట్ అయిన వారిలో 8మంది తమిళనాడుకి చెందిన వారున్నారు. మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి. వారంతా కియా మాజీ ఉద్యోగులే అని పోలీసులు తెలిపారు.
వారందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. 900 కార్ల ఇంజిన్ల మాయం ఘటనలో పటాన్ సలీమ్ A1 గా ఉన్నాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 8మంది తమిళనాడులోని రాణిపేటకు చెందిన వారు కాగా, ఒకరు తిరుపతి వాసి. నాలుగు కార్లలో తమిళనాడు నుంచి వారిని తీసుకొచ్చారు. పెనుకొండ సీఐ కార్యాలయంలో నిందితులను సీఐ, ఇద్దరు ఎస్ఐలు విచారించారు. రెండు రోజుల పాటు విచారణ అనంతరం పెనుకొండ కోర్టులో జడ్జి ముందు హాజరుపరచనున్నారు పోలీసులు.
సౌత్ కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ కియా కార్ల పరిశ్రమలో సుమారు 900 ఇంజిన్లు మాయం కావడం కలకలం రేపింది. కియాలో జరిగిన ఈ భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజిన్లు కనిపించడం లేదంటూ మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది కియా యాజమాన్యం. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఐదేళ్ల నుంచి ఇంజిన్లు చోరీ అయినట్లు తెలుస్తోంది. ”2020లో ఇంజిన్ల చోరీ మొదలైంది. ఈ వ్యవహారం ఐదేళ్ల పాటు కంటిన్యూగా నడిచింది. ఈ కేసులో చాలా లోతుగా దర్యాఫ్తు చేస్తాం” అని పెనుకొండ పోలీసులు తెలిపారు.
Also Read : ఎన్నికల్లో వైసీపీ ఓటమికి మాజీమంత్రి ప్లాన్? సిట్టింగ్ ఎమ్మెల్యేపై కుట్రలు? ఎవరా నేత, ఎందుకిలా..
‘పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో 900 ఇంజిన్లు దొంగిలించబడినట్లు నిర్ధారించబడింది. తయారీ కర్మాగారానికి వెళ్లే మార్గంలో, ప్లాంట్ ఆవరణలో ఇంజిన్లు దొంగిలించబడ్డాయి. ఈ భారీ చోరీ ఇంటి దొంగల పనిగా అనుమానిస్తున్నాం. కంపెనీ ప్రస్తుత, మాజీ ఉద్యోగుల పాత్రపై దర్యాప్తు జరుపుతున్నాం’ అని పోలీసులు వెల్లడించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏర్పాటైన తొలి భారీ పరిశ్రమగా కియాకు గుర్తింపు ఉంది. 2019 జూన్‌లో పెనుకొండ ప్లాంట్ నుంచి మొదటి కారు మార్కెట్‌లోకి విడుదలైంది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here