ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. మరో 14మంది చనిపోయారు. 20,256 శాంపిల్స్ పరీక్షించగా 998 కేసులు నమోదయ్యాయి. వీటిలో 961 స్థానికులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36 మంది, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 18,697కి పెరిగింది.
కొత్తగా 14మంది మృతి:
తాజాగా మరో 14 మంది కరోనాతో మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 232కి చేరింది. కర్నూలు జిల్లాలో ఐదుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఇద్దరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇప్పటివరకు 8వేల 422మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 10వేల 43 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మానవాళిని భయపెడుతున్న వైరస్:
కరోనా వైరస్.. గతంలో ఎన్నడూ లేనంతగా మానవాళి మొత్తాన్ని భయపెడుతున్న ముప్పు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారిన సంఖ్య కోటి దాటగా.. మృతుల సంఖ్య లక్షల్లో ఉంది. అనధికారికంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య, మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజలు కచ్చితంగా కరోనా నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని, కరోనాని కట్టడి చేసేందుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.