A new angle in the murder case of six people in Visakha: విశాఖపట్నం పెందుర్తిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు.. హంతకుడి బంధువుల ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ వచ్చే వరకు మృతదేహాలను తరలించేది లేదని ఆందోళనకు దిగారు. పోస్ట్‌మార్టమ్ చేసేందుకు కూడా వీలు లేదంటూ పట్టుబట్టారు. పదుల సంఖ్యలో అప్పలరాజు తమ్ముని ఇంటి వద్దకు చేరుకొని ధర్నా చేస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పెందుర్తిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు.. హత్యకు గురైన రమణ కుమారుడు విజయ్ స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన వెంటనే అప్పలరాజు ఎందుకు చంపాడనే విషయంపై ఆరోపణలు చేశారు. గతంలో ఒక ల్యాండ్‌కు సంబంధించిన వివాదం ఉందని.. భూ కబ్జాను ప్రశ్నించినందుకే ఈ హత్యలన్నీ చేశాడని విజయ్ ఆరోపించారు.
ఇటు ఈ హత్యల వెనక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అప్పలరాజు గ్రామంలో భూమి కబ్జా చేశాడని.. దాన్ని ప్రశ్నించినందుకే తన కుటుంబంపై పగ పెంచుకున్నాడని విజయ్ ఆరోపిస్తున్నాడు. అధికారుల తీరుతోనే ఈ దారుణం జరిగిందని మండిపడుతున్నాడు.
ఇటు అందరినీ కోల్పోయి అనాథగా మారానంటూ విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని కోల్పోయానంటూ బాధపడుతున్నాడు. తనతో పాటు మరో కుటుంబం కూడా అనాథగా మారిందని వాపోతున్నాడు.