AP Govt : ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ ఒక్కొక్కరికి రూ.లక్ష.. కొత్తగా రెండు పథకాలు..
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కోసం మరో రెండు కొత్త పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది.
AP Government
- ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం
- డ్వాక్రా మహిళలకోసం కొత్తగా రెండు పథకాలు
- రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం
AP Govt : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్.. వచ్చే నెలలో మరో రెండు కొత్త పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు తీపికబురు చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవం, సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) ఏర్పాటై 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు వరాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళల కోసం రెండు పథకాలను అమలు చేయనుంది.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ పథకాలను అమలు చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ పథకాలను డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువుకు, వివాహాలకు చేయూతనిచ్చేలా రూపొందించారు. ఈ రెండు పథకాలలో భాగంగా స్త్రీనిధి బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.లక్ష వరకు పావలా వడ్డీ రుణం ఇస్తారు. అయితే, ఈ రెండు పథకాలకు అర్హత పొందాలంటే ముందుగా డ్వాక్రా సంఘాల్లో నమోదై.. కనీసం ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం నుంచి కొనసాగుతున్న సభ్యులు అర్హులు.
ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ పథకం కింద డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహం కోసం రుణం తీసుకోవచ్చు. రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పావలా వడ్డీకి మాత్రమే ఈ రుణాలు పొందవచ్చు. ఈ రుణాన్ని 48వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద అర్హత పొందాలంటే.. లగ్నపత్రికతో పాటుగా వివాహానికి సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనాలను సమర్పిస్తే సరిపోతుంది.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ పథంలో భాగంగా డ్వాక్రా మహిళలు వారి పిల్లలకు చెల్లించాల్సిన స్కూల్, కాలేజీ ఫీజు కోసం డబ్బులు తీసుకోవచ్చు. ఇద్దరు పిల్లల చదువుకోసం రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. వీటిని కేవలం పావలా వడ్డీకి పొందవచ్చు. ఇలా తీసుకున్న సొమ్మును 48 వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుంది. ఈ రుణం తీసుకునేందుకు డ్వాక్రా మహిళలు వారి పిల్లల అడ్మిషన్ లెటర్‌తో పాటుగా, ఫీజు చెల్లించే విధానం, విద్యా సంస్థ వివరాలు, ఇతర రసీదులు సమర్పించాల్సి ఉంటుంది.
