Durgagudi irregularities : దుర్గగుడి అక్రమాలపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక.. అక్రమార్కులపై వేటు తప్పదా?

విజయవాడ దుర్గగుడిపై ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్‌.. ఇప్పుడు దేవాదాయశాఖలో కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? అక్రమార్కులపై వేటు తప్పదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Durgagudi irregularities : విజయవాడ దుర్గగుడిపై ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్‌.. ఇప్పుడు దేవాదాయశాఖలో కలకలం రేపుతోంది. అసలు గుడిలో అక్రమాలకు తెరదీసింది కిందిస్థాయి ఉద్యోగులా? లేక పైస్థాయిలో ఉన్న అధికారులా? అన్న విషయంపై చాలా క్లియర్‌గా రిపోర్ట్ ఇవ్వడంతో.. త్వరలోనే ఓ కీలక వ్యక్తిపై వేటు పడుతుందన్న ప్రచారం మొదలయ్యింది.. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? అక్రమార్కులపై వేటు తప్పదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది..

ఇంద్రకీలాద్రి ఆలయానికి ఈఓగా సురేష్ బాబు నియామకం అయినప్పటి నుంచి వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయ్‌. తరచూ ఏసీబీ, విజిలెన్స్ దాడులు జరుగుతుండగా.. వాటి నివేదికతో ఆయనపై వేటు పడేందుకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకూ మూడు రోజులపాటు దుర్గగుడిలో సోదాలు చేపట్టింది ఏసీబీ. భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్టుగా నివేదిక రెడీ చేసి ప్రభుత్వం, దేవాదాయశాఖకు ఇచ్చింది.

ఏసీబీ నివేదిక ఆధారంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 16మంది అధికారులపై దేవాదాయశాఖ చర్యలు తీసుకుంది. ఆ తర్వాత ఈఓ పాత్రపై ప్రత్యేక విచారణ చేపట్టిన ఏసీబీ, విజిలెన్స్‌ కీలక ఆధారాలు సేకరించి.. ఆయన తీసుకున్న నిర్ణయాలపై ఓ నివేదికను ప్రభుత్వానికి అందించింది. అందులో ఈఓ అనేక ఆర్ధిక తప్పిదాలకు పాల్పడినట్టు తెలిపింది ఏసీబీ. ఆడిట్ అభ్యంతరాలను, దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలను ఈఓ సురేశ్‌ బాబు బేఖాతర్ చేసి చెల్లింపులు జరిపినట్టు నిర్ధారణ అయ్యింది.

టెండర్లు, కొటేషన్లు, సామాగ్రి కొనుగోళ్లు, మెటీరియల్ సరఫరాలపై ఫ్రీ ఆడిట్ అభ్యంతరాలున్నా.. ఈఓ సురేష్‌ బాబు చెల్లింపులు చేశారు. శానిటరీ టెండర్లను సెంట్రల్ విజిలెన్స్‌ నిబంధనలకు విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్‌కు అప్పగించారాయన. తక్కువ సొమ్ముకు కోట్ చేసిన స్పార్క్‌ కంపెనీని కాదని ఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారని ఏసీబీ నివేదిక ఇచ్చింది.

దీనిపై త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నట్టు జోరుగా చర్చ నడుస్తోంది. ఎవరు తప్పు చేసినా శిక్ష ఉంటుందన్నారు దుర్గగుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు. రివర్స్ టెండరింగ్ ద్వారా శానిటేషన్ టెండర్‌లను నిర్వహిస్తామని, గత ప్రభుత్వాల తప్పులను తమకు ఆపాదించకూడదని ఆన్నారు.

ట్రెండింగ్ వార్తలు