AE Nookaraju Case : ఏఈ నూకరాజు కేసులో కొత్త ట్విస్ట్.. ఆస్తులు ఎవరికివ్వాలో వీలునామా.. కార్తికేయ చెప్పిన ‘ఆంటీ’ ఎవరు?..

AE Nookaraju Case : కాకినాడకు చెందిన పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

AE Nookaraju family Suicide Case

AE Nookaraju Case : కాకినాడకు చెందిన పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రతి చిన్న అంశాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు సాధిక్ ఖాన్ దురాగతం మరొకటి వెలుగులోకి వచ్చింది. తన కుటుంబాన్ని వేధించడం ఆపేయమని నూకరాజు రెండు నెలల క్రితమే సాధిక్ ఇంటికి వెళ్లి వేడుకున్నట్లు తెలిసింది. అయినా నిందితులు వినలేదు.. ఆ తరువాత ఇంకా వేధింపులు మరింత ఎక్కువైనట్లు.. సొంత తల్లి కూడా హితవు చెప్పిన సాధిక్ పట్టించుకోలేదని పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలిసింది.

Also Read : CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు.. కారణం ఇదే..! షాకిచ్చిన కేంద్రం

రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ వేధింపులు తట్టుకోలేక ఏఈ నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ గత ఆదివారం గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కార్తికేయ ప్రాణాలతో బయటపడగా.. నూకరాజు, సౌజన్య మృతదేహాలు లభ్యమయ్యాయి. నూకరాజు భార్య మృతదేహంకోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

పరారీలో ఉన్న నిందితుడు సాధిక్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గత రెండు నెలలుగా సాధిక్ ఫోన్ లిస్టులో ఉన్న వారందరికీ పోలీసులు ఫోన్లు చేసి నిందితుడి గురించి ఆరా తీస్తున్నారు. సాధిక్ ఆచుకీ తెలిపితే రివార్డు ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఆదివారం రాత్రి గోదావరిలో దూకే ముందే నూకరాజు మరణ వాంగ్మూలంతో పాటు వీలునామా రాసిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సాధిక్ ఖాన్ వేధింపులు భరించలేక కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ ఏఈ నూకరాజు గోదావరిలో దూకే ముందే తన ఆస్తులు ఎవరెవరికి ఇవ్వాలనే విషయమై వీలునామా రాసి పెట్టుకున్నారు. కుటుంబం ఆత్మహత్యకు కారణాన్ని తెలుపుతూ రాసిన లేఖతో పాటు వీలునామాను బయట విడిచిపెట్టి నదిలోకి దూకేశారు. స్థిర, చరాస్తుల్ని ముగ్గురి పేరున రాసి పెట్టారు. అందులో నూకరాజు సోదరి మరో ఇద్దరి పేర్లు ఉన్నట్లు సమాచారం. మనవడు కార్తికేయ తమతో పాటే దూకేసి చనిపోతాడు అనుకొని అతని పేరున ఆస్తిని రాయలేదు.

నూకరాజు కుటుంబం నదిలో దూకడానికి ముందు.. నీకు ఈత వచ్చు కాబట్టి బతికి బయట పడితే ఫలానా ఆంటీ దగ్గరకు వెళ్లు అంటూ తన తల్లి చెప్పిన మాటల్ని కార్తికేయ పోలీసులకు తెలియజేశాడు. దీంతో ఆ ఆంటీ ఎవరు ఆమెకు ఈ కేసు గురించి ఏమైనా తెలుసా..? అనే కోణంలో విచారించాలని పోలీసులు భావించారు. కానీ, ఆమె ఫోన్ మూడు రోజులుగా స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు సాధిక్ స్నేహితుడైన ఒకరి ఫోన్ కూడా పని చేయడం లేదు. ఈ ఘటన తర్వాత భయపడి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. వీరు అందుబాటులోకి వస్తే కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.