N Chandrababu Naidu(Photo : Google)
Chandrababu – CM Jagan : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఉంగుటూరు నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట ఉండడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందన్నారు. వైసీపీ పాలనపై ప్రజల్లో బాధ, ఆవేదన, కసి ఉందన్నారు చంద్రబాబు. గ్రామాలకు గ్రామాలు తిరగబడి ఈ ప్రభుత్వంపై దండయాత్ర చేయాలన్నారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నందునే సూపర్ సిక్స్ అని మేనిఫెస్టో ప్రకటించాను అని చెప్పారు. రేపటి నుంచి మొదలయ్యే ఓటర్ లిస్ట్ సవరణ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ రాజకీయ దొంగ.. దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాడు అని చంద్రబాబు ఆరోపించారు. ఓటమి భయంతో తమకు పడవు అనుకున్న ఓట్లను తొలగిస్తున్నారు అని చెప్పారు. ప్రతి ఓటును కాపాడుకోవాలి అని చంద్రబాబు సూచించారు. రేపటి నుంచి జరిగే ఓటర్ వెరిఫికేషన్ లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు చంద్రబాబు.
Also Read..YS Jagan: సీఎం జగన్ మనసులో ఏముంది.. సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఖరారు చేస్తారా?
”రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీని ఒక్క సీటు కూడా గెలవకుండా చిత్తు చిత్తుగా ఓడించాలి. వైసీపీ పాలన వల్ల ప్రజల జీవితాలు చీకటిమయం అయ్యాయి. జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ రాష్ట్రం పాలిట భస్మాసుర హస్తమైంది. ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే పాలకులు బండబూతులు తప్ప సమాధానం చెప్పరు.
రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలను చేశారు. గ్రామంలో చిన్న వీధి లైటు కూడా ఏర్పాటు చేయలేని స్థితికి సర్పంచ్ లను తెచ్చారు. కేంద్రం ఇచ్చిన నిధులను సైతం కొట్టేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం. పోలవరం విషయంలో ప్రభుత్వం తప్పులు చేసి మళ్లీ టీడీపీపై ఆరోపణలు చేస్తోంది.
నిన్న కూడా మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ డయాఫ్రం వాల్ ఏమైందో, ఎంత నష్టం జరిగిందో చెప్పలేకపోతున్నారు. పెట్రో ధరలు పెరిగితే అన్ని ధరలు పెరుగుతాయి అనే స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఎరువుల రేట్లు, పురుగు మందుల రేట్లు పెరిగి రైతులు.. కరెంట్ చార్జీలు, గ్యాస్ ధరలు, నిత్యవసరాల రేట్లు పెరిగి మహిళలు.. మద్యం ధరలు పెరిగి మందుబాబులు నానా ఇబ్బంది పడుతున్నారు” అని చంద్రబాబు వాపోయారు.