Pilli Bose: వైసీపీలో కంగారు పుట్టించిన రామచంద్రాపురం రాజకీయం.. సీఎంతో సహా ముగ్గురితో బోస్ భేటీ..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై అధికార పార్టీ అలర్ట్ అయింది. ముఖ్యంగా మంత్రి వేణుగోపాలకృష్ణపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీ బోస్‌ను బుజ్జగించాలని నిర్ణయించింది.

Pilli Bose: వైసీపీలో కంగారు పుట్టించిన రామచంద్రాపురం రాజకీయం.. సీఎంతో సహా ముగ్గురితో బోస్ భేటీ..

Pilli Subhash Chandra Bose meet CM Jagan

Pilli Subhash Chandra Bose: తూర్పుగోదావరి జిల్లా పాలిటిక్స్‌పై ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఫోకస్ పెట్టారు. అసమ్మతితో కాకరేపుతున్న ఎంపీ పిల్లి సుభాశ్‌చంద్రబోస్‌ను ప్రత్యేకంగా తాడేపల్లి (Tadepalle) పిలిపించుకుని మాట్లాడారు సీఎం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం (Ramachandrapuram), జగ్గంపేట (Jaggampeta), కాకినాడ (Kakinada) నియోజకవర్గాల్లో వైసీపీకి అసమ్మతి సెగ తగులుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అగ్గిరాజేస్తున్న అసంతృప్తులను చల్లార్చేలా ప్రయత్నాలు ఆరంభించింది వైసీపీ అధిష్టానం.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బోస్‌ను ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు జగన్.. సీఎంతో మాట్లాడాక బోస్ చల్లబడినట్లేనా? తాడేపల్లిలో ఏం జరిగింది?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై అధికార పార్టీ అలర్ట్ అయింది. ముఖ్యంగా మంత్రి వేణుగోపాలకృష్ణపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీ బోస్‌ను బుజ్జగించాలని నిర్ణయించింది. రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వేణు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాశ్‌చంద్రబోస్ వర్గీయుల మధ్య కొంతకాలంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. స్థానికేతరుడైన మంత్రి వేణు నియోజకవర్గంలో ఎంపీ బోస్ అనుచరులను అణచివేస్తున్నారని రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బోస్ కుమారుడు సూర్యప్రకాశ్‌కు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ పరువును బజారుకీడ్చారు. ఎంపీ బోస్ కూడా పార్టీ అధినాయకత్వం తీరుపట్ల కినుక వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు ఈ పరిస్థితి ఎంతమాత్రం శ్రేయష్కరం కాదని భావించిన హైకమాండ్.. ఎంపీ బోస్ ను తాడేపల్లి పిలిపించింది.

తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైన బోస్.. మంత్రి వేణు, ఆయన కుమారుడి తీరుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలో తన అనుచరులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారని.. తనకు సన్నిహితంగా ఉంటున్న మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీపై మంత్రి వేణు సమక్షంలోనే దాడి జరిగిందని సీఎం దృష్టికి తెచ్చినట్లు చెబుతున్నారు. సుమారు 30 నిమిషాలపాటు ముఖ్యమంత్రితో భేటీ అయిన బోస్ వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి రామచంద్రాపురం టిక్కెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అన్ని శ్రద్ధగా విన్న ముఖ్యమంత్రి జగన్.. ఇద్దరూ సమన్వయం నడుచుకోవాలని, ఇంకేమైనా చెప్పదలుచుకుంటే గోదావరి జిల్లాల సమన్వయకర్త మిథున్‌రెడ్డితో మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. జగన్ సూచనతో మిథున్‌రెడ్డితో కూడా బోస్ భేటీ అయ్యారు. అదేవిధంగా సీఎంతో భేటీకి ముందు సోమవారం ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కూడా సమావేశమయ్యారు బోస్.

Also Read: జగ్గంపేట వైసీపీలో ముసలం.. తోట నరసింహం వర్సెస్ ఎమ్మెల్యే చంటిబాబు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొద్దిరోజులుగా వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. రామచంద్రాపురంలో మంత్రి వేణు, ఎంపీ బోస్ వర్గీయులు పరస్పర విమర్శలతో రోడ్డెక్కగా.. జగ్గంపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు సెగపెడుతున్నారు మాజీ మంత్రి తోట నరసింహం. గత ఆదివారం నరసింహం కుమారుడు రాంజీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడికి వ్యతిరేకంగా ఆయన శిబిరం పావులు కదుపుతోంది. యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కాకినాడ ఎమ్మెల్యేపై కత్తిగట్టారు. యానాంలో తన ఓటమికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఎక్కడా ద్వారంపూడి పేరు పెట్టి విమర్శంచకపోయినా.. అంతర్గతంగానూ.. అనుచరుల వద్ద ద్వారంపూడిపై తన కోపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అమలాపురంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి విశ్వరూప్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.

Also Read: వైసీపీలో వారసుల సందడి.. తలలు పట్టుకుంటున్న వైసీపీ పెద్దలు..!

ఇలా జిల్లాలో ఒక్కో నియోజకవర్గం నుంచి అసంతృప్తులు పెరిగిపోతుండటం.. ఇక నాన్చితే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన సీఎం జగన్.. ముందుగా ఎంపీ బోస్‌తో మాట్లాడి బుజ్జగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి వేణుతో కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడి సర్దుకుపోవాలని సూచించినట్లు చెబుతున్నారు. సీఎం జోక్యంతో బోస్ మెత్తబడతారా లేక.. యథావిధిగా మంత్రి వేణుకి వ్యతిరేకంగా పనిచేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి రామచంద్రాపురం రాజకీయం హైకమాండ్‌లో కంగారు పుట్టించడంతో సీఎం జగన్ జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేలా చేసింది. ఇప్పటికే మిథున్‌రెడ్డి మిగిలిన నియోజకవర్గాల అప్‌డేట్ సీఎంకి చెప్పినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల్లో అన్నిచోట్ల సర్దుబాటు చేస్తారని అంటున్నారు.