కిక్కు కోసం శానిటైజర్లను తాగేస్తున్నారు

  • Publish Date - July 16, 2020 / 07:46 PM IST

బెజవాడలో మందుబాబులు తెలివి మీరి పోయారు. కరోనాతో మద్యం దొరక్కపోవడంతో రూటు మార్చిన మద్యం ప్రియులు కిక్కు కోసం శానిటైజర్లను తాగేస్తున్నారు. విజయవాడ పాతబస్తీలోని రోడ్లు, కొండ ప్రాంతాల్లో శానిటైజర్లు సేవిస్తూ కిక్కును ఆస్వాదిస్తున్నారు. దీనిలో 40 శాతం ఆల్కహాల్ ఉంటుందన్న భావనతో ఇష్టారాజ్యంగా శానిటైజర్లను కొనుగోలు చేసి తాగేస్తున్నారు.

మందుబాబులు 50 రూపాయల శానిటైజర్లను ఎక్కువగా కొంటున్నారు. శానిటైజర్లు తాగితే ఆరోగ్యం పాడవ్వడంతోపాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నా…మందుబాబులు పట్టించుకోవడం లేదు. పైగా వద్దని వారిస్తున్నా వారితో గొడవకు దిగుతూ కొట్లాడుతున్నారు. రాత్రిళ్లు ఆపి ఉంచిన ఆటోలే అడ్డగా ఈ కార్యక్రమం సాగుతోంది.

రోజు వారి కూలీలు, ముఠా కూలీలు ఎక్కువగా శానిటైజర్లు తాగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. శానిటైజర్లు తాగి ఘర్షణకు దిగతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శానిటైజర్ బ్యాచ్ నుంచి తమను కాపాడాలని పాతబస్తీ ప్రజలు కోరుతున్నారు. పోలీసులు గస్తీ పెంచాలని అంటున్నారు. ఇలాంటి వాటిని పూర్తిగా నివారించాలని కోరుతున్నారు. అయితే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.