Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈనెల 24 వరకు ఆగాల్సిందే..
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) కీలక అలర్ట్ జారీ చేసింది.
Tirumala
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) కీలక అలర్ట్ జారీ చేసింది. సాధారణ భక్తులకు జారీ చేసే ఉచిత సర్వదర్శనం టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) టోకెన్ల నిలిపివేతను మరో నాలుగు రోజులపాటు పొడిగిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ప్రకటించింది. తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో తిరుమలలోని శ్రీవారి భక్తులకు నిత్యం జారీచేసే సర్వదర్శన టోకెన్లను మరో నాలుగు రోజులపాటు నిలిపివేయనున్నారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు తొలుత దేవస్థానం ప్రకటించింది. తాజాగా మరో నాలుగు రోజులు పొడిగించి 24 వరకు టోకెన్ల జారీ ఉండదని అధికారులు వెల్లడించారు.
25న దర్శనానికి సంబంధించిన టోకెన్లను 24న జారీ చేయనున్నట్లు తెలిపారు. 21న దర్శనాలకు సంబంధించిన టోకెన్ల రద్దు విషయమై ముందస్తు ప్రకటన లేకపోవడంతో పలువురు భక్తులు ఆదివారం ఉదయమే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత టోకెన్లు జారీ చేయడం లేదని అధికారులు చెప్పడంతో నిరాశకు గురయ్యారు.
ఇదిలా ఉంటే ఆదివారం తిరుమల శ్రీవారిని 72,019 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,431 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.5 కోట్లు వచ్చింది. ఇదిలా ఉంటే తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనం ఇచ్చారు. ఇవాళ రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం జరగనుంది.
