ఘర్షణకు దిగిన ఆమంచి X కరణం బలరాం వర్గాలు

  • Publish Date - November 1, 2020 / 06:37 AM IST

Amanchi Krishnamohan and Karanam Balaram : ప్రకాశం జిల్లాలో మరోసారి ఆమంచి కృష్ణమోహన్‌, కరణం బలరాం వర్గాలు ఘర్షణకు దిగాయి. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఇరువర్గాల మధ్య చిన్నసైజు యుద్ధమే జరిగింది. రెండువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. పందిళ్లపల్లి ఆమంచి కృష్ణమోహన్‌ స్వగ్రామం. కరణం బలరాం పుట్టినరోజు వేడుకలను పందిళ్లపల్లిలో నిర్వహించడం గొడవకు దారితీసింది.



చీరాల నుంచి పందిళ్లపల్లికి భారీగా తరలివచ్చిన బలరాం వర్గీయులు…. బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆమంచి ఇంటి ముందుకు రాగానే జై బలరాం అంటూ నినాదాలు చేశారు. దీనికి పోటీగా ఆమంచి వర్గీయులు కూడా నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కర్రలతో దాడులకు దిగారు. ఈ గొడవలో ఆమంచి వర్గానికి చెందిన ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.



అయితే ఇరువర్గాలను పోలీసులు అదుపు చేయలేకపోయారు. ముగ్గురు డీఎస్పీలు, ఒక ఏఎస్పీ, నలుగురు సీఐలు, పదిమంది ఎస్సైలు, 50మంది కానిస్టేబుళ్లు ఉన్నా గొడవను మాత్రం కంట్రోల్‌ లోకి తీసుకురాలేకపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో అదనపు బలగాలను తరలించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కరణం బలరాం… ఆమంచిపై గెలిచారు. తర్వాత మారిన పరిస్థితుల్లో వైసీపీలో చేరారు. అప్పట్నుంచి ఇరువర్గాల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు