Amaravati Farmers Yatra
Amaravati Farmers Yatra: రైతులు ఆందోళన చెందొద్దని, అమరావతే ఏపీ రాజధాని అని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏపీకి అమరావతే రాజధాని అని, ఆరు నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. మూడు రాజధానులు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అమరావతే రాజధాని ఏపీ ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తుచేశారు.
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర బాపట్ల జిల్లాలోని నగరంలో కొనసాగుతుండగా వారికి జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. రైతులు అధైర్య పడాల్సిన పనిలేదని అన్నారు. హైకోర్టు తీర్పు వెల్లడించిన ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లడం ఏంటీ? అని ఆయన నిలదీశారు. రైతులను ఉత్తరాంధ్రకు వెళ్లవద్దని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. తమ ప్రాంతంలో కూడా పాదయాత్ర చేయాలని రైతులను కోరుతున్నానని చెప్పారు.
అమరావతి అన్ని ప్రాంతాలకు సమానం దూరంలో ఉంటుందని తెలిపారు. రైతులను మానసికంగా భయపెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా, సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించడంపై ఏపీ సర్కారు అభ్యంతరాలు తెలిపింది. ఆ ఆదేశాలు అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు చెప్పింది.