వైసీపీ ఎమ్మెల్యేపై ఆ పార్టీ వాళ్లే దాడి చేశారు : అమరావతి పరిరక్షణ సమితి

రాజధాని మార్పుపై ప్రభుత్వం మొండిగా వెళ్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది అమరావతి పరిరక్షణ సమితి. సచివాలయ ఉద్యోగులు కూడా జగన్ నిర్ణయాన్ని

  • Publish Date - January 8, 2020 / 01:05 AM IST

రాజధాని మార్పుపై ప్రభుత్వం మొండిగా వెళ్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది అమరావతి పరిరక్షణ సమితి. సచివాలయ ఉద్యోగులు కూడా జగన్ నిర్ణయాన్ని

రాజధాని మార్పుపై ప్రభుత్వం మొండిగా వెళ్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది అమరావతి పరిరక్షణ సమితి. సచివాలయ ఉద్యోగులు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. వైసీపీ వారే ఆ పార్టీ ఎమ్మెల్యేపై దాడి‌ చేసి అల్లరి చేయాలని చూస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి ఆరోపించింది. రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర చేసి.. ప్రజల్లో‌ చైతన్యం తెస్తామని స్పష్టం చేసింది.

రాజధాని కోసం పోరు బాట పట్టిన అమరావతి రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. చినకాకాని దగ్గర జాతీయ రహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించారు. అమరావతి పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుతో జాతీయ రహదారిపై కూర్చుని పోలీసుల బూట్లు తుడుస్తూ నిరసన తెలిపారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు ఎక్కడికక్కడ రైతులను అరెస్టు చేసి హాయ్‌ల్యాండ్‌, గుంటూరుకు తరలించారు. రైతులు హాయ్‌ల్యాండ్‌లో ఎండలోనే కూర్చుని నిరసన తెలిపారు. వేలాది మంది రైతులు హైవేపైకి చేరుకోవడంతో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 

రైతుల ఆందోళనల కారణంగా మంత్రి సురేష్‌.. చినకాకాని దగ్గర ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అతి కష్టం మీద పోలీసులు రోడ్డుపై కూర్చున్న రైతులను పక్కకు లాగి మంత్రి కాన్వాయ్‌ వెళ్లేలా చేశారు. ఆందోళనలో పాల్గొనే రైతుల కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను అరెస్టు చేసే క్రమంలో తోపులాట జరిగి రణరంగంలా మారింది.   

పోలీసుల తీరుపై అమరావతి పరిరక్షణ సమితి నేతలు డీజీపీకి లేఖ రాశారు. రైతుల కోసం పెడుతున్న ప్రెస్ మీట్‌లలో పోలీసులు వచ్చి కూర్చుంటున్నారని, గతంలో ఎన్నడూ లేని‌ విధంగా కేసులు పెడుతున్నారని లేఖలో రాశారు. మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా స్టేషన్లలో కూర్చోబెడుతున్నారని, కనీసం డీజీపీని కలిసి విజ్ఞప్తి చేయడానికి కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లిపై జరిగిన దాడి బాధాకరం అన్నారు. 

మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమానికి మహిళలు సంఘీభావం తెలిపారు. గుంటూరులో మహిళా జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. రాజధానిని అమరావతిలోనే  కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ నగరంలోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణం నుంచి మదర్‌ థెరీసా విగ్రహం వరకు ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీకి 2వేల మందికి పైగా మహిళలు వచ్చారు.

Also Read : కాల్చేశాడు: సంచుల్లో ఆధార్ కార్డులు, లెటర్లు