Amaravati Signature Bridge : అమరావతికి ‘సిగ్నేచర్’ గేట్‌వే.. కృష్ణానదిపై అద్భుత నిర్మాణం.. దీని ప్రత్యేకతలు ఇవే..
Amaravati Signature Bridge : ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది.
- Harish Thanniru
- Updated on- August 12, 2026 / 01:35 PM IST
Amaravati Signature Bridge : ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన భారీ ‘బ్రిడ్జి’ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సుమారు 1.10 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసలుగా ఈ వంతెనను నిర్మించనున్నారు. తద్వారా విజయవాడ–అమరావతి మధ్య రాకపోకలను మరింత సులభతరం చేయడంతో పాటు, రాజధానికి ఐకానిక్ గేట్‌వేగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అయితే, ఈ బ్రిడ్జికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
Also Read : Prajwal Revanna : జైల్లో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. సర్కార్ సీరియస్ యాక్షన్..
కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం, అమరావతి గ్రోత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏజీఐసీఎల్) చర్యలు ప్రారంభించింది. అయితే, ఈ బ్రిడ్జికి ‘సిగ్నేచర్ బ్రిడ్జ్’గా పేరును ఖరారు చేశారు. ఇది రాజధాని అమరావతికి ఒక ప్రధాన గేట్‌వేగా, పర్యాటకులను ఆకర్షించే ఐకానిక్ నిర్మాణంగా తీర్చిదిద్దాలని కూటమి సర్కార్ భావిస్తోంది. ఈ బ్రిడ్జి ఆరు వరుసలతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్నారు. వాహనాల రాకపోకలకు మాత్రమే కాకుండా పాదచారులు, సైక్లిస్టులకు కూడా సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు.
కొత్త బ్రిడ్జి ద్వారా అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు మెరుగైన కనెక్టివిటీ లభించనుంది. హైదరాబాద్ – మచిలీపట్నం జాతీయ రహదారి (ఎన్‌హెచ్ – 65), విజయవాడ నగరాలతో అమరావతి అనుసంధానాన్ని మెరుగుపర్చనున్నారు. దీనికిగాను బ్యారేజీకి 300 మీటర్ల దిగువన, అంటే.. ప్రకాశం బ్యారేజీ, రైలు బ్రిడ్జిలకు మధ్యలో సిగ్నేచర్ బ్రిడ్జిని నిర్మిస్తారు. సీతానగరం ఘాట్ నుంచి కనకదుర్గ ప్లైఓవర్ ద్వారా, మచిలీపట్నం – హైదరాబాద్ జాతీయ రహదారిని (ఎన్‌హెచ్ -65) అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీపై ఉన్న ట్రాఫిక్ రద్దీని కూడా ఈ నూతన బ్రిడ్జి కొంతమేర తగ్గించే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. సిగ్నేచర్ బ్రిడ్జి డిజైన్‌కు సంబంధించి నాలుగు నమూనాలను ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంచారు. వాటిలో ఒక నమూనాను ఎంపిక చేసి తుది రూపకల్పన దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.
ఈ ప్రాజెక్టును ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (EPC) విధానంలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కాన్సెప్ట్ డిజైన్, అంచనా వ్యయం తదితర వివరాలను ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ మూడు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం ప్రాజెక్టు అమలుపై తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రాజెక్టు అధ్యయనం కోసం బిడ్‌లు దాఖలు చేయడానికి ఈ నెల 26 వరకు గడువు ఉంది. ఎంపికైన సంస్థ 3 నెలల్లోగా డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
