మంచైనా, చెడైనా ట్రోల్ చేస్తారు.. మీరు నన్ను ట్రోల్ చేయలేదా?: నిమ్మలకు అంబటి కౌంటర్

ట్రోల్ చేశారని బాధ పడి ఆయన వచ్చినట్టున్నారు. మంచైనా, చెడైనా ట్రోల్ చేస్తారు.. మీరు ట్రోల్ నన్ను చేయలేదా? మీరిచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి ఫెయిల్ అయింది.

Ambati Rambabu counter to Nimmala Ramanaidu on Thalliki Vandanam Scheme

Ambati Rambabu on Nimmala Ramanaidu: తల్లికి వందనం పథకంపై ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామాయణం అంతా చెప్పారు కానీ అసలు కథ చెప్పలేదని వ్యాఖ్యానించారు. బడికి వెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం డబ్బులు ఇస్తారా, ఇవ్వరా అనే విషయం చెప్పలేదని అన్నారు. విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదనే పద్ధతిలో నర్మగర్భంగా మాట్లాడారని, నాలిక మడతేసి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

”మీరు విడుదల చేసిన జీవోలోనే విధివిధానాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. బడికెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం డబ్బులు ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీయిచ్చారు. జీవోలో మాత్రం ప్రతి తల్లికి రూ.15000 ఇస్తామని పేర్కొన్నారు. దీన్ని సరిచేస్తారా, లేదా? అనేది చెప్పకుండా విధివిధానాలు ఖరారు కాలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పష్టంగా బడికెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని జీవో మార్చాలి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు.

ఉచిత యిసుక అమ్మబడును అన్నట్టుగా మీ పరిపాలన ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తల్లికి వందనం పథకంపై స్పష్టమైన ప్రకటన చేయాలి. ఈ పథకంపై వివరణ ఇవ్వడానికి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. ట్రోల్ చేశారని బాధ పడి ఆయన వచ్చినట్టున్నారు. మంచైనా, చెడైనా ట్రోల్ చేస్తారు.. మీరు ట్రోల్ నన్ను చేయలేదా? మీరిచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి ఫెయిల్ అయింది. మిగతా ఐదు అమలు చేయకపోతే వైసీపీ వెంటబడుతుంది. ప్రజల తరపున మిమ్మల్ని నిలదీస్తామ”ని అంబటి రాంబాబు అన్నారు.

Also Read: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తాం: మంత్రి నిమ్మల రామానాయుడు

జనంతో మమేకమయ్యే నేత జగన్
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజలకు ఎప్పుడు దూరంగా లేరని.. నిత్యం నాయకులను, జనాన్ని కలుస్తున్నారని చెప్పారు. జగన్ జనం మధ్యన ఉండి మమేకమయ్యే నాయకుడని చెప్పుకొచ్చారు. ఆయన ఎవరినీ కలవడం లేదని చంద్రబాబు దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనాన్ని తీసుకురావాల్సిన అవసరం తమకు లేదని, జనం తండోప తండాలుగా వస్తారని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు