నెల్లూరు కొంతకాలంగా అధికార పార్టీ రాజకీయ అంతర్యుద్ధం సాగుతోంది. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. ఈక్రమంలో నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో తమ ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు ఆనం కుటుంబం పావులు కదుపుతోందని అంటున్నారు. అనిల్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో ఆనం రామనారాయణరెడ్డికి సఖ్యత లేదు.
మరోవైపు మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. నియోజకవర్గంలో తన మాట వినడం లేదని మీడియా సమావేశంలోనే అధికారులపైన, ప్రభుత్వంపైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు మంత్రి అనిల్, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిలను టార్గెట్ చేస్తూ ఆనం రామనారాయణరెడ్డి… నెల్లూరు మాఫియాలకు అడ్డాగా మారిందనే విమర్శలు చేసి దుమారాన్ని లేపారు.
అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఆనం సోదరులు చక్రం తిప్పారు. జిల్లాలో తమకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి మృతితో ఆ కుటుంబ ప్రాబల్యం జిల్లాలో బాగా తగ్గిపోయింది. ఆనం వర్గం కూడా చెల్లాచెదురైపోయింది. కుటుంబ సభ్యుల మధ్య కూడా వివాదాలు నెలకొన్నాయి. ఎవరికి వారుగా వేర్వేరు పార్టీల్లో ఉంటూ వస్తున్నారు. మొత్తం నలుగురు సోదరుల్లో ఆనం వివేకానందరెడ్డి మరణించగా మిగిలిన ముగ్గురిలో రామనారాయణరెడ్డి, విజయకుమార్ రెడ్డి వైసీపీలోనూ, జయకుమార్ రెడ్డి టీడీపీలో కొనసాగుతున్నారు.
కొద్ది రోజుల క్రితం వరకు ఎవరికి వారుగా ఉంటున్న ఈ అన్నదమ్ముల్లో ఇప్పుడు రామనారాయణరెడ్డి, విజయకుమార్‌రెడ్డి ఏకమయ్యేందుకు ముందుకొచ్చారట. తమ విభేదాలను పక్కన పెట్టేశారట. ఎవరికి వారుగా ఉంటే జిల్లాలో మనుగడ కష్టమని భావించి కలిసిపోయి జిల్లాలో మళ్లీ చక్రం తిప్పాలని ప్లాన్ చేసుకున్నారట. పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోయినా తమ వర్గానికి అండగా నిలవాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.
వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూర్ రెడ్డి మాత్రమే నెల్లూరులో రాజకీయాల్లో కొంత యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. మంత్రి అనిల్ నెల్లూరు సిటీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో నగరంలో ఆనం కుటుంబానికి అంత ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో అనిల్ పాల్గొనే కార్యక్రమాల్లో రంగ మయూర్‌రెడ్డి అంతగా పాల్గొనడం లేదు. తమ ప్రాభవం మళ్లీ పెరగాలంటే కుటుంబం కలసికట్టుగా ఉండడం ఒక్కటే పరిష్కారమని భావించి, ఏకమయ్యారని అంటున్నారు.
నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలను ఇప్పుడు ఆనం ఫ్యామిలీ టార్గెట్ చేసిందని సన్నిహితులు అంటున్నారు. నెల్లూరులో రాజకీయం మళ్లీ స్పీడ్ పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఆనం కుటుంబంలో యువ నాయకులు రంగమయూర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి తమ కుటుంబ రాజకీయాలకు అండగా నిలువనున్నారన్న ప్రచారం సాగుతోంది. డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న విజయకుమార్ రెడ్డి కూడా తమను పట్టించుకొనే వారెవరూ లేరంటూ అన్న రాంనారాయణరెడ్డిని కలసి ఆవేదన వ్యక్తం చేశారట.
గతంలో ఈ ఇద్దరు సోదరుల మధ్య గ్యాప్ ఉండేది. ఇప్పుడు మాత్రం కలసి పని చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేశారట. మరి ఈ కలయికతో ఆనం ఫ్యామిలీకి పూర్వ వైభవం వస్తుందా లేదా అన్నది చూడాలి.